
భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరేందుకు భారత్ మరొక్క అడుగు దూరంలోనే ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఈ మెగా టోర్నీలో ఫ్రాన్స్ పోరాటాన్ని ముగించింది. బుధవారం క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా 3-0తో ఫ్రాన్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ నాలుగో నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి హేవర్డ్ జెరిమి ఆస్ట్రేలియా ఖాతా తెరిచాడు.
గోవర్స్ (19వ నిమిషంలో), అలెస్కి (37వ నిమిషంలో) చెరో గోల్‌తో ఆస్ట్రేలియాకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. ఫ్రాన్స్‌ను చిత్తుగా 3-0తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా 20వ ర్యాంకు దక్కించుకుని సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 3-2తో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాకు షాకిచ్చింది. ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనాతో పోరాడి అద్భుత విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్.. ఈ టోర్నీలో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నమోదైంది. గొంజలో పీలట్ (17వ నిమిషంలో) గోల్ కొట్టి అర్జెంటీనాకు ఆధిక్యాన్ని అందించాడు. మరో పదినిమిషాలకు మిడిల్‌టన్ (27వ నిమిషంలో) గోల్‌తో ఇంగ్లాండ్ స్కోరు సమం చేసింది.
45వ నిమిషంలో విల్ కల్నాన్ గోల్ కొట్టి ఇంగ్లాండ్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఇంగ్లాండ్‌కు ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు మిగల్చకుండా పీలట్ (48వ నిమిషంలో) మరో గోల్‌తో స్కోరు సమం చేశాడు. దాంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసేలా కనిపించింది. అయితే చివరి నిమిషంలో హ్యారీ మార్టిన్ గోల్ కొట్టి ఇంగ్లాండ్ జట్టును సంతోషంలో ముంచెత్తాడు. శనివారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. జర్మనీ వర్సెస్ బెల్జియం విజేతతో, ఆస్ట్రేలియా.. ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ విజేతతో తలపడనున్నాయి.