
ఎఫ్‌ఐహెచ్ హాకీ సిరీస్ ఫైనల్స్‌లో భారత సీనియర్ పురుష, మహిళా జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్నాయి. హాకీ ఇండియా (హెచ్‌ఐ) శనివారం కొత్త జెర్సీలను విడుదల చేసింది. ముదురు నీలం రంగులో ఉన్న ఈ కొత్త జెర్సీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. జెర్సీ భుజాలపై, స్లీవ్స్‌కు త్రివర్ణానికి ప్రతీకగా రంగులు ఉన్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
పురుష జట్టుకు మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా ఉన్నాడు. మహిళా జట్టుకు స్ట్రైకర్ రాణి రాంపాల్ సారథ్యం వహిస్తోంది. గోల్‌కీపర్ సవిత వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. భారత జెర్సీ ధరించినప్పుడు గర్వంగా ఫీలవుతామని మన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు పురుషుల ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ జరగనుంది. ఇక మహిళల సిరీస్ ఈ నెల15 నుంచి జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతాయి.
ఎఫ్‌ఐహెచ్ మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత జట్టు రాణిస్తదని కోచ్ పేర్కొన్నాడు. ఈ ఏడాదిలో భారత మహిళల జట్టు స్పెయిన్, ఐర్లాండ్, మలేసియా, కొరియాలలో పర్యటించింది. ఈ సిరీస్‌లలో భారత జట్టు మంచి ప్రదర్శనే చేసింది. దీంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.