క్వాంటన్: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు విజేతగా నిలిచింది. మలేషియాలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విజయం సాధించింది. లీగ్ దశలోనే భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
అయితే ఫైనల్లో ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ జట్టు ఉవ్విళ్లూరినా ఆ ఆశ నెరవేరలేదు. దీంతో దీపావళి పర్వదినాన భారత హాకీ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో విజేత నిలిచి భారతీయులకు పండుగ కానుకను అందించారు. ఈ మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది.

18వ నిమిషంలోనే భారత ఆటగాడు రూపిందర్ పాల్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచి భారత్‌కు తొలి గోల్ సాధించాడు. అదే ఉత్సాహంతో 23వ నిమిషంలో భారత ఆటగాడు అఫాన్ యూసుఫ్ మరో గోల్ చేయడంతో ఆధిక్యం 2-0తేడాతో ఆధిక్యం సాధించింది.
ఆ తర్వాత పాకిస్థాన్ వరుసగా రెండు గోల్స్ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమమయ్యాయి. దీంతో పైనల్ మ్యాచ్‌లో పోరు నువ్వా, నేనా అన్నట్లుగా సాగింది. మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా, నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ మళ్లీ 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
చివర్లో మళ్లీ స్కోరు సమం చేసేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లు గోల్ చేయలేకపోయారు. దీంతో భారత్... ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీని రెండోసారి గెలుచుకుంది. ఈ విజయంతో భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.