Hockey Asia Cup Final: ఆసియా కప్ 2025 హాకీ టోర్నమెంట్ ఫైనల్ లో భారత మహిళల జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. పటిష్టమైన చైనా జట్టుతో జరిగిన ఈ కీలకమైన మ్యాచ్‌లో భారత్ 1-4 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ప్రపంచ కప్-2026కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
ఆరంభంలో ఆధిక్యం.. ఆ తర్వాత వెనుకబాటు
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. కేవలం 39 సెకన్లలోనే నవనీత్ కౌర్ ఒక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యం సాధించిపెట్టింది. ఈ ప్రారంభ గోల్‌తో భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే చైనా జట్టు తమదైన వ్యూహంతో ఆడింది. భారత్ ఆధిక్యం సాధించిన 3 నిమిషాల తర్వాత, చైనా వరుసగా రెండు పెనాల్టీ కార్నర్‌లను సాధించినప్పటికీ.. భారత డిఫెన్స్ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది.

రెండో క్వార్టర్‌లో చైనా దూకుడు
మొదటి క్వార్టర్ తర్వాత చైనా జట్టు మరింత దూకుడు పెంచింది. భారత డిఫెన్స్‌పై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తూ అనేక పెనాల్టీ కార్నర్‌లను సాధించింది. భారత సర్కిల్‌కు దగ్గరలో బంతిని ఎక్కువసేపు తమ నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ.. గోల్ చేయడంలో విఫలమైంది. చివరికి, వారి పట్టుదల ఫలించింది. మ్యాచ్ 21వ నిమిషంలో జిక్సియా ఔ ఒక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేసింది. దీంతో మొదటి సగం మ్యాచ్ 1-1 స్కోరుతో ముగిసింది.
భారత ఫార్వర్డ్ లైన్ వైఫల్యం
రెండో సగం మ్యాచ్‌లో భారత జట్టు మరింత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ చైనా రక్షణను ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో భారత ఫార్వర్డ్ లైన్ లోని కీలక ఆటగాళ్లు ముంతాజ్ ఖాన్, లాల్‌రెమ్సియామి, సునీలిత తోప్పో తమ గత ప్రదర్శనను చూపించలేకపోయారు. మూడో క్వార్టర్‌లో చైనా అటాక్ కొనసాగించగా.. హాంగ్ లీ కౌంటర్-అటాక్ ద్వారా ఒక ఫీల్డ్ గోల్‌ను సాధించి చైనాకు 2-1 ఆధిక్యం సాధించిపెట్టింది.
చివరి నిమిషాల్లో చైనా విజయం
ప్రపంచంలో 9వ ర్యాంకులో ఉన్న భారత్ చివరి క్వార్టర్‌లో స్కోరును సమం చేయడానికి గట్టిగా ప్రయత్నించింది, కానీ చైనా డిఫెన్స్ వారిని నిలువరించింది. చివరి ఐదు నిమిషాల్లో చైనా రెండు వేగవంతమైన గోల్స్‌తో తమ విజయాన్ని ఖరారు చేసుకుంది. 51వ నిమిషంలో మెయిరాంగ్ జౌ ఫీల్డ్ గోల్ సాధించగా, రెండు నిమిషాల తర్వాత జియాకి ఝోంగ్ మరొక ఫీల్డ్ గోల్‌తో మ్యాచ్‌ను 4-1తో ముగించింది.
ఈ విజయంతో చైనా తమ మూడో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుని, బెల్జియం, నెదర్లాండ్స్‌లలో జరగనున్న 2026 ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించింది. ఈ ఓటమితో భారత మహిళల జట్టు ఇప్పుడు ప్రపంచ కప్ క్వాలిఫైయర్లలో పోటీపడాల్సి ఉంటుంది.