
హైదరాబాద్: ప్రతిష్టాత్మక హాకీ చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న భారత్ కల కలగానే మిగిలిపోయింది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండోసారి భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2016 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్ షూటౌట్‌లోనే 1-3 స్కోరుతో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం.
దీంతో విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన టైటిల్ పోరు పెనాల్టీ షూటౌట్‌లో 1-3తో భారత్ ఓటమిపాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1-1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
మ్యాచ్ ఫ్రారంభమైనప్పటి నుంచి భారత్‌పై పూర్తి ఆధిక్యంతో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతూ వచ్చింది. అయితే పలుమార్లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో భారత స్ట్రైకర్లు విఫలమయ్యారు. తొలి పది నిమిషాల్లోపు వెంటవెంటనే దక్కిన పెనాల్టీలను టీమిండియా గోల్‌గా మలువలేకపోయింది.
మరోవైపు మ్యాచ్ 24వ నిమిషంలో దక్కిన పెనాల్టీని గోవర్స్ గోల్ చేయడంతో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జోరు పెంచిన భారత్ 43నిమిషంలో తొలి గోల్ కొట్టింది. భారత ఆటగాడు వివేక్ సాగర్ ఆసీస్ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి స్కోరును 1-1కి సమం చేశాడు. తర్వాతి నుంచి మరో గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడినా ఫలితం లేకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.
దీంతో షూటౌట్‌లో చెలరేగిన ఆసీస్ 3-1తో ఆధిక్యాన్ని సంపాదించి ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత కెప్టెన్ శ్రీజేష్ టోర్నీ అత్యుత్తమ గోల్‌కీపర్ అవార్డు అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీని రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా 15వ సారి దక్కించుకుంది.