
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ఎన్నో ఆశలు రేపిన మహిళల హాకీ జట్టు.. చివరికి నిరాశ పరిచింది. కాంస్య పతకం కోసం సాగిన పోరులో రాణి రాంపాల్ సారథ్యంలోని టీమ్.. అద్భుతంగా పోరాడింది. చివరి వరకూ ప్రతి గోల్ కోసం పోరాడింది. బ్రాంజ్ మెడల్‌ను ముద్దాడటానికి గ్రేట్ బ్రిటన్‌తో తలపడిన మ్యాచ్‌లో చేదు ఫలితాన్ని చవి చూసింది. ఒకే ఒక్క గోల్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. 3-4 గోల్స్ తేడాతో అటు మ్యాచ్, ఇటు పతకాన్ని చేజార్చుకునేలా చేసింది. ఒక దశలో భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఆధిక్యతలోకి దూసుకెళ్లింది.
ఆ సమయంలో ప్రత్యర్థి జట్టు గ్రేట్ బ్రిటన్ తనకు దక్కిన అవకాశలను సద్వినియోగం చేసుకుంది. అటాకింగ్ గేమ్‌తో భారత్‌పై పైచేయి సాధించింది. నిర్ణయాత్మకమైన నాలుగో క్వార్టర్‌లో.. ఇంకాస్సేపట్లో మ్యాచ్ ముగుస్తుందనే దశలో గ్రేట్ బ్రిటన్ సాధించిన గోల్.. కోట్లాది మంది భారతీయును తీవ్రంగా నిరాశ పరిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ 4-3 తేడాతో భారత్‌పై నెగ్గి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మహిళా హాకీ ప్లేయర్లు ప్రదర్శించిన తెగవకు భారత్.. సలాం కొడుతోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు జట్టుకు ధైర్యం చెప్పారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా పోరాటం సాగించారని ప్రశంసించారు.

ఈ క్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరో అడుగు ముందుకేశారు. హాకి ప్లేయర్లకు 50 లక్షల రూపాయల నజరానాను ఆయన ప్రకటించారు. ఈ నజరానా తొమ్మిదిమంది ప్లేయర్లకు మాత్రమే వర్తింపజేశారు. ఆ తొమ్మిది మంది ప్లేయర్లు కూడా హర్యానాకు చెందిన వారే. మిగిలిన ఇద్దరిలో సుశీలా చాను మణిపూర్‌కు చెందిన ప్లేయర్ కాగా.. వందన కఠారియా స్వస్థలం హరిద్వార్. మిగిలిన వారందరూ హర్యానాకు చెందిన ప్లేయర్లే. వారందరికీ ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలను బహుమానంగా అందజేస్తామని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టు అద్భుతంగా రాణించిందని ఆయన ప్రశంసించారు. పతకం కోసం గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. జట్టును చూసి దేశం గర్విస్తోందని అన్నారు. ఈ ఉదయం తన అధికారిక నివాసంలో టీవీలో మ్యాచ్‌ను తిలకించారు. కాంస్య పతకాన్ని సాధించడానికి గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో జట్టు ఓడిపోయినందుకు తనకు కొంత నిరాశ కలిగించినప్పటికీ- పోరాడిన తీరు స్ఫూర్తినింపిందని ఖట్టర్ వ్యాఖ్యానించారు. నిరాశలో ఉన్న యువతకు స్ఫూర్తినింపేలా మహిళా జట్టు ప్రస్థానం కొనసాగిందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అకాంక్షించారు.
సెమీ ఫైనల్స్‌లో మహిళల జట్టు పోరాడిన తీరు.. అద్భుతంగా ఉందని, 2024లో ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందనే విశ్వాసం కలిగించిందని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లకు ఘనంగా స్వాగతం పలుకుతామని, ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలంటూ అధికార యంత్రాంగాన్ని సూచిస్తానని మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. అంతకుముందు- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత మహిళా హాకీ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. వారు చూపిన తెగువ, పోరాటం.. నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.