భారత్ ఘనవిజయం
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ చివరి మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్‌లో హోరాహోరీగా సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో నిర్ణీత 60 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. అందులో భారత్ 3-2 తేడా ఇంగ్లాండ్ జట్టుపై ఘన విజయం సాధించింది. త్వరలో జరగబోయే హాకీ వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టుకు ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం.
నెమ్మదిగా సాగిన తొలి సగం
మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా ఆడింది. మొదటి క్వార్టర్‌లోనే ఆతిథ్య జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ.. భారత గోల్ కీపర్ మోహిత్ శశికుమార్ అద్భుతంగా అడ్డుకుని జట్టును ఆదుకున్నాడు. ఆయన వరుసగా ఇంగ్లాండ్ ఆటగాళ్ల గోల్ ప్రయత్నాలను తిప్పికొట్టాడు. భారత్ తరఫున అభిషేక్‌కు గోల్ చేసే మంచి అవకాశం వచ్చినప్పటికీ అది చేజారింది. దీంతో హాఫ్ టైమ్ ముగిసేసరికి ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఇరు జట్ల డిఫెండర్లు, గోల్ కీపర్లు ఒకరికొకరు గట్టి పోటీనిచ్చారు.

ఉత్కంఠ రేపిన వీడియో రెఫరల్స్
మూడో క్వార్టర్‌లో భారత జట్టు మరింత దూకుడు పెంచింది. కెప్టెన్ హార్దిక్ సింగ్ మిడ్‌ఫీల్డ్ నుంచి అద్భుతమైన ఆటతీరుతో భారత్‌కు పెనాల్టీ కార్నర్ అందించినప్పటికీ.. దానిని గోల్‌గా మార్చడంలో అమన్‌దీప్ లక్రా విఫలమయ్యాడు. అయితే ఈ క్వార్టర్ చివర్లో మ్యాచ్‌లో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ చోటుచేసుకుంది. భారత ఆటగాడు యష్‌దీప్ సింగ్ ఫౌల్ చేశాడనే కారణంతో అంపైర్ ఇంగ్లాండ్‌కు పెనాల్టీ స్ట్రోక్ ఇచ్చారు. కానీ భారత్ వెంటనే వీడియో రెఫరల్ తీసుకోగా.. రీప్లేలో భారత ఆటగాడి ట్యాకింగ్ సరైనదేనని తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. చివరి క్వార్టర్లో కూడా భారత గోల్ కీపర్ సూరజ్ కర్కేరా ఇంగ్లాండ్ ప్రయత్నాలను అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరి నిమిషంలో ఇంగ్లాండ్ జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్‌పై కూడా భారత్ వీడియో రెఫరల్ విజయం సాధించింది.
షూటౌట్లో భారత్ పంజా
నిర్ణీత సమయం ముగిసేవరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్లో భారత్ తరఫున అభిషేక్, శిలానంద్ లక్రా, హార్దిక్ సింగ్‌లు అద్భుత గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. గోల్ కీపర్లు మోహిత్ శశికుమార్, సూరజ్ కర్కేరాలు కీలక సమయాల్లో గోల్స్ కాపాడుతూ క్లీన్ షీట్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మ్యాచ్ అంతా డిఫెన్స్‌లో రాణించిన సంజయ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇటీవల క్రికెట్లో భారత జట్టు వరుసగా రెండు ఓటములను చవిచూసిన తరుణంలో హాకీ జట్టు సాధించిన ఈ విజయం క్రీడాభిమానుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications