యువ భారత్ విజయం వెనకున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
హైదరాబాద్: ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను చిత్తుచేసి రెండోసారి ఈ టైటిల్‌ను గెల్చుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం వెనుక ఓ వ్యక్తి అమోఘ కృషి, పట్టుదల ఉన్నాయి. గతంలో తాను ఎంచుకున్న క్రీడలో విఫలమైన ఆ క్రీడాకారుడి బోధనలే నేడు భారత్‌కు హాకీ జూనియర్ అండర్-21 వరల్డ్ కప్‌ను అందించాయి.
అతడే హరేంద్ర సింగ్. ప్రస్తుతం భారత భారత్ హాకీ జూనియర్ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేయకుండా పక్కకు పడేసిన ఓ క్రీడాకారుడు. జాతీయ జట్టుకు తాను ఎంపిక కాని సమయంలో అతడు ఎంతగా కుమిలిపోయాడో ఆయన మాటలను వింటే మీకే అర్ధమవుతుంది.

కోచ్ హరేంద్ర సింగ్ సమాధానం
హాకీ జట్టు విజయం సాధించిన వెంటనే క్రీడాకారులును ప్రశ్నించిన మీడియా అనంతరం కోచ్ హరేంద్ర సింగ్‌ను ప్రశ్నించింది. ఆ సమయంలో హరేంద్ర సింగ్ కళ్లు చెమ్మగిల్లాయి. అంతే కాదు అతడి చెంపల మీదుగా ఆ కన్నీళ్లు దారగా కారాయి. ఈ విజయం వెనుక మీరే ఉండటం ఒక క్రీడాకారుడిగా, కోచ్‌గా ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా. తన గత స్మృతులు చెప్పారు.

1998లో కోచ్‌గా కెరీర్ ప్రారంభించా
తాను ఒక క్రీడాకారుడినని, కసిగా ఆడేవాడినని, ఒకప్పుడు జాతీయ టీంకు ఎంపికచేయకుండా పక్కకు పెట్టారని అన్నారు. అప్పుడే తనకు తాను సంబోధించుకుని, అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయగలనన్న ఆత్మ విశ్వాసంతో 1998లో కోచ్‌గా కెరీర్ ప్రారంభించానని చెప్పుకొచ్చాడు.

22 ఏళ్ల జీవితాన్ని శిక్షణకే కేటాయించా
‘ఆరోజే నేను నా అంతరాత్మకు చెప్పుకున్నాను. నేను ఒలింపియన్‌ను కాకపోవచ్చు. కానీ నేను ఒలింపియన్లను, ప్రపంచ చాంపియన్లను తయారు చేయగలనని దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేయగలనని. ఈ రోజు భారత త్రివర్ణ పతాకం వరల్డ్ కప్ విజయంతో మరింత ఎత్తులో రెపరెపలాడుతోంది. ఈ క్షణం కోసం నేను ఎదురుచూశాను. ప్రపంచ కప్ భారత్ ఎలాగైనా తన శిక్షణతో గెలవాలని 22 ఏళ్ల జీవితాన్ని శిక్షణకే కేటాయించాను. అది నేడు ఆవిష్కృతమైంది' అని చెప్పాడు.

15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై జరిగిన టోర్నీలో విజయం
జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటికి మూడుసార్లు భారత కుర్రాళ్లు ఫైనల్ చేరారు. 1997లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు 2001లో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై జరిగిన టోర్నీలో విజయం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ కప్ గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అంతేకాదు జర్మనీ తర్వాత రెండుసార్లు ప్రపంచకప్ అందుకొన్న జట్టుగా కూడా భారత్ చరిత్ర సృష్టించింది.
వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు
హాకీ జూనియర్ ప్రపంచ కప్ సాధించిన యువ క్రీడాకారులకు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు తెలియజేశారు. వారు దేశం గర్వించేలా చేశారని, ఇది నిజంగా చాలా గొప్ప విజయం అని అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఎంజాయ్ ది బెల్జియం చాకోలెట్ బాయ్స్' అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications