కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు చేరిన భారత హాకీ జట్టు

Posted By:
CWG 2018, hockey: India win 4-3 against England in last pool game, setting up New Zealand semifinal

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-3 గోల్స్ తేడాతో నెగ్గింది.

ఈ విజయంతో భారత్ జట్టు పూల్-బిలో అగ్రస్థానాన్ని దక్కించుకుని సెమీస్‌ బెర్తుని సుస్థిరం చేసుకుంది. టీమిండియా శుక్రవారం జరిగే సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌‌లో తొలి అర్ధభాగం వరకూ భారత్‌కి గోల్ లభించలేదు. దీంతో మొదట్లో ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ఆట ప్రారంభమైన 17వ నిమిషంలోనే ఇంగ్లాండ్ గోల్ కొట్టడంతో భారత్‌పై క్రమంగా ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ దశలో 32వ నిమిషంలో మన్‌ప్రీత్ సింగ్ చూడచక్కని గోల్‌తో భారత్ ఖాతా తెరవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత దాదాపు 19 నిమిషాల పాటు ఇరు జట్లూ గోల్ కోసం తెగ ప్రయత్నాలు చేశాయి.

చివరి నిమిషాల్లో భారత్ రెండు గోల్స్ చేసి .. ఊహించని రీతిలో విజయాన్ని నమోదు చేసింది. 51వ నిమిషంలో రుపీందర్ పాల్ సింగ్ గోల్ కొట్టి భారత్‌ను 2-1తో ఆధిక్యంలో నిలపగా.. తర్వాత నిమిషంలోనే ఇంగ్లాండ్ గోల్‌తో ఆధిక్యాన్ని 2-2గా సమం చేసింది. మళ్లీ 56వ నిమిషంలో ఇంగ్లాండ్ మరో గోల్ చేయడంతో ఆధిక్యం 2-3కి చేరింది.

ఇక మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో ఇంగ్లండ్‌కు భారత్ షాకిచ్చింది. 58వ నిమిషంలో వరుణ్ కుమార్, 59వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ వరుస గోల్స్‌తో భారత్‌ను గెలుపు సంబరాల్లో ముంచెత్తారు. చివరి రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత్.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో వేల్స్‌ని 4-3తేడాతో ఓడించింది. చివరగా మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1తేడాతో విజయం సాధించింది.

Story first published: Wednesday, April 11, 2018, 20:14 [IST]
Other articles published on Apr 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి