చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత హాకీ టీం చెలరేగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా తాజాగా మరో టీంను చిత్తు చేసింది. పూల్-ఏలో తమ చివరి లీగ్ మ్యాచులో భారత జట్టు.. బంగ్లాదేశ్‌ను ఎదుర్కొంది. ఈ మ్యాచులో కూడా చెలరేగిన ప్లేయర్లు ఏకంగా 12-0 తేడాతో బంగ్లాను మట్టికరిపించారు.
భారత జట్టులో స్టార్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఇద్దరూ కూడా హ్యాట్రిక్స్ సాధించడం గమనార్హం. దీంతో భారత జట్టు ఈ ఆసియా గేమ్స్‌లో తమ గ్రూప్ దశ మ్యాచులన్నీ గెలిచి టేబుల్ టాపర్స్‌గా సెమీఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఈ ఐదు మ్యాచుల్లో కలిపి భారత్ అత్యధికంగా 58 గోల్స్ చేసింది. ఈ జోరు చూసిన ఫ్యాన్స్ కచ్చితంగా భారత జట్టు పతకం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

అలాగే బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి వరుస సెట్లలో గెలిచి రౌండ్ ఆఫ్ 16 చేరుకుంది. చైనాకు చెందిన జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన సాత్విక్, చిరాగ్ అదరగొట్టారు. వరుస సెట్లలో 21-11, 21-16 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న సాత్విక్, చిరాగ్ జోడీ ఈసారి ఆసియా క్రీడల్లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక మహిళల కబడ్డీ టీం తమ తొలి గేమ్‌ను డ్రా చేసుకుంది. భారత్, చైనా తలపడిన ఈ మ్యాచులో రెండు జట్లు 34-34 పాయింట్లు సాధించాయి. మ్యాచ్ మొదటి హాఫ్‌లో 17-15తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు.. సెకండ్ హాఫ్‌లో 19-17తో వెనుకబడింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత అమ్మాయిలు తమ తర్వాతి గేమ్‌లో సౌత్ కొరియాతో తలపడతారు.
భారత స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోసల్ కూడా ముందడుగు వేశాడు. రౌండ్ ఆఫ్ 16 గేమ్‌లో కువైట్ ప్లేయర్ అమ్మార్ ఆల్టామిమీపై 3-0 తేడాతో క్లీన్ స్వీప్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లో అడుగు పెట్టాడు. మరో స్క్వాష్ ప్లేయర్ మనోజ్.. జపాన్‌కు చెందిన ప్లేయర్ చేతిలో ఓడిపోయి ఆసియా గేమ్స్ నుంచి తప్పుకున్నాడు.