హైదరాబాద్: ఆసియా కప్ హాకీలో భారత మహిళా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌తో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4-2తో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో భారత్ 4-1 స్కోరుతో చైనాను చిత్తు చేయడం విశేషం.
ఈ మ్యాచ్‌లో గుర్జీత్ కౌర్ మ్యాచ్ 7వ నిమిషంలోనే గోల్ సాధించడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే భారత్ మరో రెండు గోల్స్ చేసింది. దీంతో తొలి క్వార్టర్‌లోనే 3-0తో ఆధిక్యం రావడంతో జపాన్ పూర్తిగా ఒత్తిడికి గురైంది.
ఇక, జపాన్ జట్టులో షిహో సుజీ (17వ), యుయి ఇషిబాషీ (28వ) గోల్స్ సాధించారు. ఈ మ్యాచ్‌లో భారత మహిళలు ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. జపాన్ డిఫెన్స్‌లోని లోపాలను అనుకూలంగా మలుచుకుని వరుస గోల్స్‌తో విరుచుకుపడ్డారు.

మ్యాచ్ తొలి క్వార్టర్ 7వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను డ్రాగ్‌ఫ్లికర్ గుర్జీత్‌కౌర్ గోల్‌గా మలచడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జపాన్ గోల్‌కీపర్ అకియోను ఏమారుస్తూ గుర్జీత్ బంతి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపింది. రెండు నిమిషాల వ్యవధిలో నవ్‌జ్యోత్‌కౌర్ కళ్లు చెదిరే ఫీల్డ్‌గోల్ చేయగా, గుర్జీత్‌కౌర్ మరో పెనాల్టీ కార్నర్ కొట్టింది.
దీంతో భారత్ ఆధిక్యం 3-0కు పెరిగింది. రెండో క్వార్టర్ 17వ నిమిషంలో షిహో సుజీ, భారత డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఫీల్డ్‌గోల్ చేయడంతో జపాన్ తొలి గోల్ చేసింది. ఈ క్రమంలో జపాన్ స్ట్రెకర్లు పలుమార్లు మన గోల్‌పోస్ట్‌పై దాడులకు పాల్పడ్డారు. మ్యాచ్ 28వ నిమిషంలో యుయి చేసిన ఫీల్డ్ గోల్‌తో భారత ఆధిక్యాన్ని 2-3కు తగ్గించింది.
ఇక 38వ నిమిషంలో లాల్‌రెమ్‌సియామి చేసిన ఫీల్డ్‌గోల్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పది నిమిషాల తేడాలో లాల్‌రెసియామి గోల్ చేయడంతో టీమిండియా 4-2తో విజయం సాధించింది.