హైదరాబాద్: ఆసియా కప్ హాకీ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. పూల్-ఏ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 3-1తో ఘన విజయం సాధించింది. తాజా విజయంతో భారత్ 9 పాయింట్లతో పూల్-ఏ దశలో అగ్రస్ధానంలో నిలిచింది. దీంతో భారత్ సూపర్-4 దశకు చేరుకుంది.
కొత్త కోచ్ జోయెర్డ్ మరీన్ సారథ్యంలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 5-1, బంగ్లాదేశ్‌ను 7-0తో ఓడించింది. వరుస విజయాలతో టోర్నీలో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజా విజయంతో ఇంగ్లాండ్‌లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్‌లో పాకిస్థాన్‌పై 6-1 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత గోల్ చేసే అవకాశం పాకిస్థాన్‌కే వచ్చినా, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక రెండో క్వార్టర్‌లో టీమిండియా జోరు పెంచింది. ఈ క్రమంలో 17వ నిమిషంలో ఆకాశ్‌దీప్ నుంచి పాస్ అందుకున్న చింగ్లేన్సనా గోల్ కొట్టి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.
దీంతో భారత్‌కు 1-0 ఆధిక్యం లభించింది. భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ లభించినా.. తృటిలో గోల్ కొట్టే చాన్స్‌ను మిస్సయింది. ఇక, మూడో క్వార్టర్‌లో రిజ్వాన్, అబూ మహమ్మద్‌లకు రెఫరీ పసుపు కార్డు చూపడంతో పాక్ తొమ్మిది మందితో ఆడాల్సి వచ్చింది. దీన్ని భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.
44వ నిమిషంలో రమణ్ దీప్ సింగ్ రెండో గోల్ సాధించాడు. ఇక 45 నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ ప్రీత్‌సింగ్ గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 3-0 ఆధిక్యం సాధించింది. చివరి 15 నిమిషాల్లో పాకిస్థాన్ రేసులోకొచ్చింది. 49వ నిమిషంలో అలీ షాన్ ఫీల్డ్ స్ట్రయిక్‌తో గోల్ చేసిన లాభం లేకపోయింది.