
హైదరాబాద్: భారీ అంచనాలతో టోర్నీ ఆరంభించిన జట్లకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గ్రూపు దశ ముగియడంతో.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాలలో ఉన్న జట్లు ఇంటి ముఖం పట్టేశాయి. ఈ దారిలోనే నడుస్తూ.. గతేడాది విజయానికి తగ్గ ప్రదర్శన ఏ మాత్రం చేయకుండా.. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. మరోవైపు ఆల్‌టైమ్ ఫేవరెట్ బ్రెజిల్, మాజీ ఛాంపియన్లు స్పెయిన్, అర్జెంటీనా అతి కష్టం మీద టోర్నీలో మొదటి దశను దాటాయి.
ఇలా ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకొన్నాయి. ఇదిలా ఉంటే, గ్రూప్-హెచ్‌లో పోరు మాత్రం ఆసక్తికరంగా ముగిసింది. ముందుగా నాకౌట్‌కు చేరే అవకాశాలున్న ఏకైక ఆఫ్రికా జట్టు సెనెగల్ 0-1తో కొలంబియాపై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా, పోలెండ్‌పై ఓడినా.. తొలిసారి ఫేయిర్ ప్లే ర్యాంకింగ్ ఆధారంగా ఆసియా జట్టు జపాన్ నాకౌట్‌కు చేరుకుంది.
సెనెగల్ నిష్ర్కమణతో ఈ ప్రపంచకప్‌లో ఆఫ్రికా జట్ల పోరాటం ముగిసినట్లయింది. ఇలా ఫిఫా చరిత్రలో 36ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్రికా జట్ల ఖాతాలో మరో చెత్త రికార్డుకు తెరలేచింది. 1982 ఫిఫా ప్రపంచకప్ తర్వాత కనీసం ఒక్క ఆఫ్రికా జట్టు అయినా రెండో రౌండ్‌కు చేరుకుంటుంది. కానీ, ఈ సారి మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా జరగడం గమనార్హం.
కాగా ఈ ప్రపంచకప్‌కు ఆఫ్రికా నుంచి ఈజిప్టు, మొరాకో, టునిషియా, నైజీరియా, సెనెగల్ అర్హత సాధించాయి. ఇందులో ఎన్నో అంచనాలతో అడుగుపెట్టిన ఈజిప్టు, మొరాకో తీవ్రంగా నిరాశ పరచాయి. టునిషియా మాత్రం నామమాత్ర ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే నైజీరియా, సెనెగల్, నాకౌట్‌కు చేరుకునే ప్రయత్నం చేసినా చివరి మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఫలితం లేకుండా పోయింది.