Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమీర్‌పేట కంటే చిన్న దేశాలు వరల్డ్‌కప్ ఆడుతుంటే.. భారత్‌కు ఏందీ కర్మ?

జనాభాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడలేకపోవడం దేశంలోని క్రీడాభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నేళ్లుగా భారత ఫుట్‌బాల్ పరిపాలన వివాదాల్లో చిక్కుకోవడం క్రీడాభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం భారత ఫుట్‌బాల్‌కు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ అద్భుతం ఎప్పుడో జరుగుతుందోనని భారత్ ఫుట్ బాల్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా భారతీయ ఫుట్‌బాల్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

ప్రస్తుతం ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌కు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 48 దేశాలు ఈ ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో పాల్గొంటుండగా.. మన భారత్ మాత్రం మరోసారి ఈ టోర్నీకి దూరమైంది. ఫిఫా ప్రపంచ కప్ ఎప్పుడు ప్రారంభమైనా.. కోట్లాది మంది భారత అభిమానులు తమ దేశం కూడా ఆడుతుందనే అంతటి మక్కువతో మ్యాచ్‌లను చూస్తుంటారు. నెట్టింట చర్చలు, ఇష్టమైన జట్ల కోసం ఇంట్లో సంబరాలు చేస్తూ దేశమంతా ఫుట్‌బాల్ రంగుల్లో మునిగిపోతుంది. కొందరు లియోనెల్ మెస్సీ జట్టును ఉత్సాహపరుస్తుంటే.. మరికొందరు రొనాల్డో దేశమైన పోర్చుగల్‌కు సపోర్ట్ చేస్తుంటారు. అయితే ఈ ఉత్కంఠ మధ్య ప్రతిసారీ ఒకే ప్రశ్న తెరపైకి వస్తుంది. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ ఫిఫా వరల్డ్ కప్‌ను అసలు ఎప్పుడు ఆడుతుంది? అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది.

Why India Never Played FIFA World Cup The 1950 Unfinished Story and Dark Reality of Indian Football

ఫిఫా ర్యాంకింగ్స్‌లో 138వ స్థానం
ఈ ప్రశ్న రావడం సమంజసమే.. ఎందుకంటే ఫుట్‌బాల్‌తో ఇండియాకు ఉన్న సంబంధం ఈనాటిది కాదు. దేశంలోని లక్షలాది మంది పిల్లలు ఫుట్ బాల్ ఆడుతున్నారు. కోట్లాది మంది దీనిని టీవీల్లో వీక్షిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ క్రీడ క్రికెట్ కు సమానంగా ప్రాచుర్యం పొందింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత జట్టు ఇప్పటివరకు ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అతిపెద్ద వేదికకు చేరుకోలేకపోవడం ఆందోళనను కలిగిస్తోంది. ఫిఫాలో సభ్యత్వం ఉన్న 211 దేశాల్లో భారత్ కూడా ఒకటి. కానీ ప్రస్తుతం భారత్ ఫిఫా ర్యాంకింగ్స్ లో 138వ స్థానంలో ఉందనే నిజం అభిమానులను బాధిస్తోంది. కేప్ వర్డే, కురాకో వంటి చిన్న దేశాలు కూడా ఫిఫా ప్రపంచ కప్‌లో సత్తా చాటుతుంటే.. భారత్ మాత్రం కనీసం ఆసియా స్థాయిలో కూడా రాణించలేకపోతోంది. భారత జట్టు వచ్చే ఏడాది జరిగే ఏఎఫ్సీ ఆసియా కప్‌కు కూడా అర్హత సాధించలేకపోవడం నిజంగా నిరాశను కలిగిస్తోంది.

ఆ నిబంధన వల్లే ఫుట్‌బాల్‌కు దూరమైందా?
నిజానికి భారత్ 1950లోనే ఫిఫా ప్రపంచ కప్ ఆడటానికి చాలా దగ్గరగా వచ్చింది. బ్రెజిల్ లో జరిగిన ఈ ప్రపంచ కప్ కు భారత్ ఎటువంటి క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా అర్హత సాధించింది. ఆసియన్ క్వాలిఫయింగ్ గ్రూపులోని మయన్మార్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ జట్లు టోర్నీ నుంచి వైదొలగడంతో ఇండియాకు నేరుగా ప్రవేశం లభించింది. స్వీడన్, ఇటలీ, పరాగ్వే వంటి బలమైన జట్లతో కూడిన గ్రూప్ లో భారత్ ను ఉంచారు. కానీ భారత జట్టు బ్రెజిల్‌కు చేరుకోలేకపోయింది.

ఆ సమయంలో భారత ఆటగాళ్లను చెప్పులు లేకుండా ఆడేందుకు ఫిఫా అనుమతించపోవడంతోనే భారత జట్టు టోర్నీ నుంచి వైదొలిగిందనే ఓ ప్రచారం సుదీర్ఘకాలం పాటు సాగింది. అయితే ఇది పూర్తి నిజం కాదు. దీని వెనుక అసలు కారణం ఆర్థిక, పరిపాలనాపరమైన లోపాలేనని తెలిసింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశంలో తీవ్ర వనరుల కొరతతో సతమతమవుతోంది. జట్టును అంత దూరం బ్రెజిల్‌కు పంపాలంటే భారీగా ఖర్చయ్యేది. అలాగే సన్నద్ధతకు తగినంత సమయం కూడా లేదు. వీటన్నింటికీ మించి ఆ సమయంలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రపంచ కప్ కంటే ఒలింపిక్స్‌నే అత్యంత ముఖ్యమైనదిగా భావించింది. ఫలితంగా భారత్ తన చరిత్రలో అతిపెద్ద అవకాశాన్ని చేజార్చుకుంది.

చాలా వెనుకబడిన భారత్
1950 తర్వాత భారత్ ఎన్నోసార్లు ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో పాల్గొన్నప్పటికీ చివరి దశకు చేరుకోలేకపోయింది. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రీ వంటి దిగ్గజ ఆటగాళ్లు 21వ శతాబ్ధంలో భారత ఫుట్‌బాల్‌కు కొత్త గుర్తింపును అందించారు. ఈ జట్టు ఆసియా స్థాయిలో కొన్ని మంచి విజయాలను నమోదు చేసినప్పటికీ.. ఇప్పటికీ చాలా వెనుకబడి ఉంది. ఒకప్పుడు ఆసియాలో భారత జట్టుకు మంచి ఆధిపత్యం ఉండేది. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో భారత జట్టు 2-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. చున్నీ గోస్వామి, పీకే బెనర్జీ, తులసీదాస్ బలరామ్‌ల త్రయం అప్పట్లో సంచలనాలు సృష్టించింది. ఆ తర్వాత 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచింది. కానీ ఆ తర్వాత నుంచి భారత ఫుట్‌బాల్‌లో మొదలైన పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

క్రికెట్ వల్లే మన ఫుట్‌బాల్ ఖతమైందా?
భారత్ ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు దూరం కావడానికి క్రికెట్ విపరీతమైన ప్రజాదరణే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తుంటారు.. కానీ అసలు కథ వేరే ఉంది. భారత క్రీడారంగంలో డబ్బు, స్పాన్సర్లు, మీడియా కవరేజీ, ప్రజాదరణ అంతా క్రికెట్ చుట్టూనే తిరుగుతుందనేది నిజం. దీనివల్ల చాలా మంది ఆటగాళ్లు ఫుట్‌బాల్‌కు బదులు క్రికెట్‌ను కెరీర్ గా ఎంచుకుంటున్నారు. అయితే కేవలం క్రికెట్ ను మాత్రమే నిందించటం తప్పు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి దేశాలు బలమైన ఫుట్‌బాల్ సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నాయి. అసలు తేడా ఏమిటంటే ప్రణాళిక, పెట్టుబడి, ఆలోచన. భారత ఫుట్‌బాల్ చాలా కాలంగా అంతర్గత పరిపాలనాపరమైన వివాదాలు, ఐఎఫ్ఎఫ్ లో చట్టపరమైన చిక్కుల వల్ల దెబ్బతింది. ఇండియన్ సూపర్ లీగ్ 12వ సీజన్ కూడా ఈసారి ఎన్నో ఇబ్బందుల మధ్య నిర్వహించాల్సి వచ్చింది.

వ్యవస్థ లోపమా? ప్రతిభ కొరతా?
భారత ఫుట్‌బాల్‌లో అసలైన సమస్య ప్రతిభ లేకపోవడం కాదు, సరైన వ్యవస్థ లేకపోవడం. ప్రపంచంలోని విజయవంతమైన దేశాలు 8-10 సంవత్సరాల వయస్సు నుంచే పిల్లలను గుర్తించి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాయి. వారికి బలమైన స్కూల్ లీగ్‌లు, ఆధునిక అకాడమీలు, వేలాది మంది శిక్షకులు అందుబాటులో ఉంటారు. ఇండియాలో అట్టడుగు స్థాయిలో ఈ నిర్మాణం ఇప్పటికీ చాలా బలహీనంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో పిల్లలకు క్రమం తప్పకుండా పోటీల్లో పాల్గొనే అవకాశాలే లేవు. బలహీనమైన స్కౌటింగ్ వ్యవస్థ, పరిమిత సౌకర్యాల వల్లే భారత్ వెనుకబడిపోతోంది.

పెరిగిన ఫిఫా స్థానాలు: భారత్‌కు దక్కేనా ఛాన్స్?
అయితే 2026 నుంచి ఫిఫా ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యను 32 నుండి 48కి పెంచడం ఇండియాకు ఓ ఆశాకిరణం లాంటిది. దీనివల్ల ఆసియా దేశాలకు మరిన్ని స్థానాలు అందుబాటులోకి వచ్చాయి. సిద్ధాంతపరంగా భారత్‌కు అవకాశాలు మెరుగైనప్పటికీ.. కేవలం స్లాట్లు పెరిగితే సరిపోదు. పాఠశాల స్థాయి నుంచి ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తూ, కనీసం 15-20 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేయాలి. మొరాకో, క్రొయేషియా వంటి దేశాలు సరైన వ్యూహంతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించవచ్చని నిరూపించాయి. భారతదేశంలో జనాభా ఉంది, ప్రతిభ ఉంది, ఫుట్‌బాల్‌పై అపారమైన క్రేజ్ కూడా ఉంది. లోపించిందల్లా బలమైన మౌలిక సదుపాయాలు, స్థిరమైన పెట్టుబడి మాత్రమే.

ఇప్పుడు భారతదేశం ఫిఫా ప్రపంచకప్ ఆడుతుందా లేదా అనేది ప్రశ్న కాదు, ఆ కలను నిజం చేసుకోవడానికి దేశం ఎంత తీవ్రంగా కృషి చేస్తుందనేదే అసలు ప్రశ్న. పాలకులు, క్రీడా సమాఖ్యలు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. రాబోయే రోజుల్లో ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ కేవలం వీక్షకురాలిగా కాకుండా, మైదానంలో ప్రత్యర్థులతో నేరుగా తలపడే రోజు ఎంతో దూరంలో లేదు.

Story first published: Tuesday, June 16, 2026, 11:19 [IST]
Other articles published on Jun 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+