కోల్‌కతా: క్రీడాకారుడిలో దాగి ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్దేవాడే కోచ్. క్రీడాకారుల్లో ఉన్న సద్గుణాలను వెలికితీసి, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు విజయం పట్ల అంకిత భావాన్ని పెంపొందించే సామర్థ్యం కోచ్‌లకే సొంతం.
జాతీయంగా ఫుట్‌బాల్ ఆట ప్రోత్సాహానికి 2014లో ప్రారంభించిన ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) మూడో ఎడిషన్ ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి ఎడిషన్ చాంపియన్, మలి సీజన్ విజేతలు టైటిల్ కైవసానికి ఉవ్విళ్లూరుతుండగా, మిగతా ఆరు జట్లు ముచ్చటగా మూడోసారైనా విజయం సాధించాలని తపిస్తున్నాయి.
ముఖ్యంగా ఎనిమిది ఫ్రాంచైసీల కోచ్‌లు తమ జట్లకు అవిశ్రాంతంగా శిక్షణనిస్తూ ఆటలో తర్ఫీదు పెంచుతున్నారు. డిపెండింగ్ చాంప్.. 2015 విజేత చెన్నైయిన్ ఎఫ్‌సి కోచ్ ఇటాలియన్ మార్కో మాటరాజ్జి వరుసగా రెండోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోవాలని తహతహలాడుతున్నాడు.

గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన ఎఫ్‌సి గోవా ఫ్రాంచైసీ కోచ్ మెటారాజ్జి జికో ఈ సీజన్‌లోనైనా తన జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు.
తొలి సెషన్‌లో విజేత అట్లెంటికో డి కోల్‌కతాపై ఫైనల్ పోరులో ఓటమి పాలైన ఎఫ్‌సి పుణె సిటీ కోచ్, స్పెయిన్‌కు చెందిన అంటోనియో హబాస్ కూడా సత్ఫలితాలు రాబట్టాలని కల కంటున్నాడు.
మూడో సీజన్‌కు వచ్చేసరికి కేరళ బ్లాక్ బస్టర్స్ కోచ్ స్టీవ్ కొప్పెల్, ముంబై సిటీ ఎఫ్‌సి అలెగ్జాండ్రె గైమారేస్‌తోపాటు తొలిసారి చాంపియన్ కోల్‌కతా కోచ్ జోస్ మొలీనా, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టు కోచ్ నెలో వింగడా, ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సి జియాంలుకా జంబ్రోట్టా కూడా అదే పట్టుదల ప్రదర్శిస్తున్నారు.
విజయం కోసం ఓటమిని ద్వేషించాలి: మార్కొ మాట్టారజ్జీ
డిపెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సి కోచ్ మార్కొ మాటారజ్జీ మాత్రం తన జట్టు సభ్యులు గత రెండు సీజన్ల ఆట నుంచి చాలా నేర్చుకున్నాడని గట్టిగా విశ్వసిస్తున్నాడు. తొలిదశలో ఇటాలియన్ స్టయిల్‌లో ఆట ఆడేందుకు భౌతికంగా శక్తి యుక్తులు లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడనిచ్చిన మార్కో 2015 సీజన్‌లో మాత్రం అలర్ట్‌గా వ్యవహరించాడు.
నిరంతరం డ్రస్సింగ్ రూమ్‌లో కనిపిస్తూ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో తొలుత మూడు లీగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైతేనేం. మిగతా ఐదు మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫుట్‌బాల్ ఆడే విధానంలో ఆకర్షణీయతను చొప్పించి 2015లో చైన్నైని విజేతగా నిలిపాడు.
పదాల గారడీతో జికో కనికట్టు
ఎఫ్‌సి గోవా జట్టు మాటలు, పదాల గారడీతో తొలిఏడాది 2014లో క్రీడాకారుల్లో స్ఫూర్తి రగిల్చేందుకు కోచ్ I బ్రెజిలియన్ లెజెండ్ జికో తెలివైన పద్ధతుల్లో వారి ఆటతీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తూ వచ్చాడు. ఈ దఫా ఇంగ్లిష్ హెవీ వైట్స్ చెల్సియా, ఫెనెబ్రాచ్‌లను రప్పించి జట్టును బలోపేతం చేశాడు.
గత సీజన్‌లో ఫాటరోడాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సి, తమ జట్టును ఆచరణలో సరిగ్గా ఆడకుండా దెబ్బ తీసిందన్నాడు.ఈ మ్యాచ్ ఫలితం ఆయనను వ్యక్తిగతంగా ఇబ్బందులు తెచ్చి పెట్టినా మానసిక దాడితో ఖచ్చితంగా ఈ దఫా పోగొట్టుకున్న చోటే టైటిల్ గెలుచుకునేలా గోవన్లను తీర్చిదిద్దుతున్నాడు జికో.
ఎఫ్‌సి పుణె సిటీకి కొత్త గురువు
తొలి సీజన్‌లో అట్లెంటికో డీ కోల్‌కతా ఫ్రాంచైసీ కోచ్‌గా వ్యవహరించడంతోపాటు ఆ జట్టును విజయ తీరాలవైపు నడిపించాడు అంటోనియో హబాస్. రెండో సీజన్‌లో కోల్‌కతా రండు సెమీ ఫైనల్స్‌లో గెలుపుకోసం కేరళ బ్లాక్‌బస్టర్‌లో అటాకింగ్ క్రీడాకారుడు లయాన్ హుమ్‌ను జట్టులోకి తీసుకుని సెమీస్ దరికి చేర్చడంలోనూ ఆయన పాత్రే కీలకం.
తాను కోచ్‌గా వ్యవహరించే జట్టుకు నేరుగా ఆడటంతోపాటు బాలెన్సింగ్ పాటిస్తూ ముందుకు సాగాడు. ఈ దఫా పుణె జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆంటోనియో అబ్బాస్‌పై చాలా మంది భారీ ఆశలే పెట్టుకున్నారు.
ఢిల్లీ కోచ్ గియాంలుకాకిది కొత్త అనుభవం
ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సి జట్టు కోచ్‌గా ఇటాలియన్ గియాంలుకా జాంబ్రొట్టాకు శిక్షణ కొత్త అనుభవం. చెల్సియా కోచ్ ఆంటోనియో కోంటే విధానాన్నే తన జట్టు సభ్యులకూ వర్తింపజేస్తానని ముందే సంకేతాలిచ్చేశాడు.
ఇక ఇంగ్లిష్ క్లబ్‌ల లీడింగ్‌లో కీలక పాత పోషించిన స్టీవ్ కొప్పెల్ విజయాలు అనేకమే. క్రితంసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కేరళ బ్లాక్ బస్టర్స్ విజయావకాశాల్లో కొప్పెల్ ఈ దఫా మరో సరికొత్త రికార్డు నెలకొల్పుతాడని ఆశిస్తున్నారు.
సెమీసే కాదు ఫైనల్ విజయం మాదేనన్న నీలో
గత ఏడాది సెమీస్‌లో ఓటమి పాలైన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి కోచ్ నీలో వింగాడ ఈ ధపా టైటిల్ కైవశం చేసుకుని తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉనాడు. ప్రొఫెసర్‌గా పేరుపడ్డ నీలో.. మ్యాచ్‌లో ఆలౌట్ అటాకింగ్ విధానమే తనకు ముద్దని చెప్తున్నాడు.
సమయం వృధాకు వ్యతిరేకం అలెగ్జాండ్రీ
ముంబై సిటీ ఎఫ్‌సి జట్టు కొత్త కోచ్ అలెగ్జాండ్రీ గౌమారేస్ సమయం వృథా చేసేందుకు వ్యతిరేకమంటారు. సానుకూల వాతావరణం ఉంటేనే సత్ఫలితాలు ఉంటాయంటాడీ కోస్టారికా మాన్. సునిల్ చెత్రి, డయాగో ఫోర్లాన్, మాటియాస్ డిఫెడిరికో వంటి లెజెండ్స్ గల ముంబై సిటీ ఆటగాళ్లు మంచి ఆట తీరు ప్రదర్శనతోపాటు దానికి సంబంధించిన మెళకువలు నేర్చుకోవాలని సూచిస్తున్నాడు.
తొలి సీజన్ టైటిల్ విజేత, మలి విడత సెమీ ఫైనలిస్ట్ అయిన అట్లెంటికో డీ కోల్‌కతా.. మూడో దఫా టోర్నీలో విజయం సాధించి కీర్తి ప్రతిష్ఠలు పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. దీనికి జట్టు కోచ్ జోస్ ఫ్రాన్సిస్కో మొలినా ఆచరణాత్మక గైడెన్సే కారణం.
లా లిగా లీగ్‌లో విల్లార్రెల్ ఎఫ్‌సి కోచ్‌గా వ్యవహరించిన మొలికా.. తాజాగా కోల్‌కతా జట్టుకు మంచి ఆటతీరును అందుబాటులోకి తెస్తాడని భావిస్తున్నారు. అనుభవజ్ఞులైన కోచ్‌ల మార్గదర్శకత్వంలో ఈ దఫా ఐఎస్‌ఎల్ టోర్నీ సంచలనాలకు నిలయమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.