
లండన్: వేన్ రూనీ. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం. పరిచయ వాక్యాలు అక్కర్లేని సాకర్ హీరో. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లకు చిన్న వయస్సులోనే వీడ్కోలు పలికిన ఈ స్టార్ ఫుట్ బాలర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అల్లాటప్పాగా కాదు.. అసాధారణంగా. 70 గజాల దూరం నుంచి అంటే.. హాఫ్ వే లైన్‌కు లోపలి నుంచి వేన్ రూనీ కొట్టిన ఓ కిక్.. గురి తప్పలేదు. బుల్లెట్‌లా దూసుకెళ్లింది. నేరుగా గోల్ పోస్ట్‌ను ముద్దాడింది ఆ బంతి. దీన్ని అడ్డుకోవడానికి గోల్ కీపర్ బ్రియాన్ రోవ్ సుమారు ఆరు అడుగుల మేర ఎత్తు గాల్లోకి ఎగిరినప్పటికీ..సాధ్యం కాలేదంటే ఆ బంతి వేగం, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వేన్ రూనీ ప్రస్తుతం డీసీ యునైటెడ్ మేజర్ లీగ్ సాకర్ (ఎంఎస్ఎల్) క్లబ్ తరఫున ఆడుతున్నాడు. వాషింగ్టన్‌లో బుధవారం రాత్రి ఒర్లాండో సిటీ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు వేన్ రూనీ. మ్యాచ్ ఆరంభమైన పదవ నిమిషంలో అద్భుతాన్ని ఆవిష్కరించాడతను. హాఫ్ వే లైన్ లోపలి నుంచి రూనీ కొట్టిన షాట్‌కు బాల్ స్టెన్‌గన్ నుంచి వెలువడిన బుల్లెట్‌లా దూసుకెళ్లింది. నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. రూనీ ఆడిన షాట్ స్థలం నుంచి గోల్ పోస్ట్‌కు మధ్య ఉన్న దూరం 70 గజాలు. అయినప్పటికీ.. గురి తప్పలేదు.
వేన్ రూనీ ఈ కిక్ కొట్టే సమయానికి ఒర్లాండో సిటీ గోల్ కీపర్ బ్రియాన్ రోవ్.. తన స్థానంలో లేడు. గోల్ పోస్ట్ నుంచి సుమారు నాలుగైదు గజాల మేరకు ముందుకొచ్చాడు. వేన్ రూనీ కిక్ నుంచి వెలువడిన బాల్..గోల్ పోస్ట్ మీదుగా వెళ్లిపోతుందని అనుకున్నాడో.. ఏమో కొన్ని క్షణాల పాటు ఏమరుపాటుగా కనిపించాడు. బంతిని చూస్తూండిపోయాడు.
నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్తోందని గ్రహించిన బ్రియాన్.. దాన్ని అడ్డుకోవడానికి పక్షిలా గాల్లోకి ఎగిరాడు. ఆరు అడుగుల ఎత్తు ఎగిరినప్పటికీ.. బంతిని మాత్రం అందుకోలేకపోయాడు. గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లిందా బంతి. ఈ ఒక్క గోల్‌తోనే మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఒర్లాండో సిటీ టీమ్‌పై విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఆ తరువాత రెండు జట్ల నుంచీ ఒక్క గోల్ కూడా సాధ్యపడలేదు.