కోల్‌కతా: తనకు ఇప్పటికిప్పుడు ప్లేన్ (విమానం)లో దూకేసి కోచిలో సహచర ప్లేయర్ల వద్దకు దూసుకు పోవాలని ఉన్నదని అట్లెటికో డి కోల్ కతా డిఫెండర్ అర్నాబ్ మొండాల్ వ్యాఖ్యానించాడు. సెమీ ఫైనల్స్‌కు ముందు తీవ్ర గాయంతో పక్కకు తప్పుకున్న మొండాల్ ఆదివారం కోచిలో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుతో జరిగిన టైటిల్ పోరులో ఎటికె విజయం సాధించిన తర్వాత ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పై విధంగా అన్నాడు.
గాయం వల్ల మరో నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఈ ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇప్పటికిప్పుడు కోచికి దూసుకెళ్లాలని కోరిక పుడుతున్నదని తెలిపాడు. టోర్నమెంట్ అంతా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మొండాల్ తన మనోభావాలను సహచర ప్లేయర్లతో పంచుకోవాలని తహతహాలాడుతున్నట్లు చెప్పాడు. ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో నార్త్ఈస్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తమ విజయావకాశాలను మలుపు తిప్పిందన్నాడు.
తాము నార్త్ఈస్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయంతో పుంజుకున్నామని, తమ జట్టు సభ్యులందరిని ఐక్యంగా ముందుకు నడిపిందని ఆయన తెలిపాడు. తర్వాత ఎఫ్ సి గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరి క్షణంలో స్టీఫెన్ పియర్సన్ చేసిన గోల్‌తో తమ ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరాయన్నాడు. ఈ రెండు జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో విజయాలే తమను నాకౌట్ దశకు చేర్చాయని మొండాల్ వివరించాడు.
దీనికి తోడు జట్టు సభ్యులంతా ఉమ్మడిగా ముందుకు వెళ్లడం కూడా తమ సక్సెస్ మంత్రకు కారణమని కూడా చెప్పాడు. తాము అద్భుతమైన టీంగా బరిలోకి దిగామని, ఏ ఒక్కరు తాము ప్రముఖులమని భావించలేదని, అందరినీ ఒకేలా చూశారన్నారు. టీంలో ఐక్యత వల్లే టైటిల్ గెలుచుకోగలిగామని మొండాల్ వ్యాఖ్యానించాడు.

సంతోష సాగరంలో జువెల్ రాజా
జువెల్ రాజా చేసిన పెనాల్టీ షూటౌట్ గోల్‌తోనే అట్లెటికో డి కోల్ కతా 4 - 3 స్కోర్ తేడాతో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై విజయం సాధించి ఐఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకున్నది. తన గోల్ వల్లే జట్టు టైటిల్ సాధించడంతో జువెల్ రాజా సంతోష సాగరంలో మునిగిపోయాడు. ఈ అనుభవం తనకు చాలా గొప్పగా అనిపిస్తున్నదని చెప్పాడు. గతేడాది సెమీ ఫైనల్స్ వరకూ దూసుకెళ్లినా ఈ ఏడాది టైటిల్ గెలుచుకోవడం గొప్పగా ఉందన్నాడు.
తాను సాధించిన పెనాల్టీ షూటౌట్ గోల్ వల్లే జట్టు గెలుపు బాటలో పయనించినందుకు సంతోషంగా ఉన్నదని అన్నాడు. మ్యాచ్ ప్రారంభానికి, షూటౌట్ గోల్ చేసిన తర్వాత కూడా తాను చాలా రిలాక్సింగ్‌గా ఉన్నానని చెప్పాడు తాను గోల్ చేయడంతోనే మొత్తం స్టేడియం అంతా మూగబోయిందని పేర్కొన్నాడు.
అందుకు తాను సంతోషంగా ఉన్నానని, ప్రతి ఫుట్ బాలర్ కూడా 60, 70వేల మంది అభిమానుల మధ్య ఆడాలని ఆకాంక్షిస్తాడని చెప్పాడు. తాము సహజసిద్ధంగానే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటామన్నాడు. గతేడాది సెమీ ఫైనల్స్ లో చెన్నైయిన్ చేతిలో ఓటమి పాలైనా, గెలిచే అర్హత తమ జట్టుకే ఉన్నదని గుర్తుచేశాడు.