చెన్నై: నూతన కోచ్ జియాంలుకా జంబ్రొట్టా నేతృత్వంలో ఢిల్లీ డైనమోస్ క్లబ్.. ప్రస్తుత డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సితో చెన్నైలోని మెరీనా బీచ్ స్టేడియంలో తల పడనున్నది. తొలి ఎడిషన్‌లో నామమాత్రపు పాత్ర పోషించిన ఢిల్లీ డైనమోస్.. గత ఏడాది సెమీ ఫైనల్స్ వరకూ దూసుకెళ్లగలిగింది. బ్రెజిలియన్ వరల్డ్ కప్ విన్నర్ రోబర్టో కార్లోస్ సహకారంతో ఎఫ్‌సి గోవాపై 1 - 3 స్కోర్ తేడాతో సెమీస్‌లో ఓటమి పాలైంది.
రెండేళ్లలోనే ఇద్దరు ప్రధాన కోచ్‌లను మార్చిన ఘనత ఢిల్లీ డైనమోస్‌ది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కాంట్రాక్ట్‌తో ఐఎస్‌ఎల్ మూడో ఎడిషన్‌లో అడుగు పెట్టిన జంబ్రొట్టా.. ఢిల్లీ డైనమోస్‌ను ప్రత్యర్థులపై అటాకింగ్, డిఫెన్స్‌తో తన జట్టు గెలుపునకు సర్వం సన్నద్ధంచేశాడు.
ఈ సందర్భంగా జంబ్రొట్టా మీడియాతో మాట్లాడుతూ 'ప్రీ - సీజన్‌లో నేను చాలా సంతోషించా. కానీ గురువారం నుంచి చాంపియన్ షిప్ టోర్నీ మొదలవుతుంది. ఒకవేళ మేం మంచి ఆటతీరు ప్రదర్శిస్తామేమో' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'టీం సభ్యులు సంఘటితంగా ఉండాలి. గేమ్‌లో ప్రత్యర్థిపై మానసికంగా విజయం సాధించాలంటే అటాకింగ్, డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. గెలుపుకోసం మనమేదైనా చేయాలి' అని చెప్పారు. జంబ్రొట్టాకు జట్టులో అతిపెద్ద దన్ను కెప్టెన్ ఫ్లోరెంట్ మాలౌడా. 2006 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇటలీకి కప్ పోవడంలో కారణమైన ప్లేయర్ ఫ్లోరెంట్ మాలౌడా కావడం ఆసక్తికర పరిణామం.

మరోవైపు సీజన్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సి.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ను 2 - 2 స్కోర్ తేడాతో డ్రాగా ముగించింది. కెప్టెన్ జాన్ ఆర్నె రైస్ నేతృత్వంలోని చెన్నై జట్టు పూర్తిగా డిఫెన్సివ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది.
ఇటువంటి పరిస్థితుల్లో కోచ్ మాటరాజ్జీ ప్రతిపాదించిన డిఫెన్స్ వ్యూహాన్ని అమలుచేసే జట్టు కెప్టెన్ జాన్ ఆర్నె రైస్ టీంకు అదనపు బలం. మరో గమ్మత్తేమిటంటే రైస్ గత సీజన్‌లో ఢిల్లీ డైనమోస్‌కు ప్రాతినిధ్యం వహించడం ఆసక్తికర పరిణామం.
తమపై ఎటువంటి ఒత్తిడి లేదని, డిఫెండింగ్ చాంపియన్లుగా చివరి వరకు దాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యం తప్ప, తమ జట్టుపై ఎటువంటి ఒత్తిడి లేదని చెన్నై కోచ్ మాట్టరాజ్జీ వ్యాఖ్యానించాడు. కోల్‌కతాతో ప్రారంభ మ్యాచ్ ఆడిన చెన్నై టీం.. గంగూలీ సేనను నిలువరించగలిగింది. వాస్తవంగా తమకు విధించిన ఫెనాల్టీ.. కోల్‌కతాకు వేయాల్సిందని మాటరాజ్జీ అన్నాడు.
తమ జట్టులో అంతా కుర్రాళ్లు నేర్చుకోవాల్సిన వారు. 30 ఏళ్లు దాటిన వారు కూడా తప్పిదాలకు పాల్పడితే సరి కాదని చెప్పాడు. ఈ పొరపాట్లకు మూల్యమేమిటో తాము ఇంతకు ముందే తెలుసుకున్నామని మాటరాజ్జీ తెలిపాడు.
ఢిల్లీ డైనమోస్ కొత్త కోచ్ జంబ్రొట్టాకు, చెన్నై కోచ్ మాటరాజ్జీ స్వాగతం పలుకుతున్నట్లు చెప్పాడు. ఆయన తనకు సహచర ప్లేయర్‌గా తెలుసు గానీ, కోచ్‌గా తెలియదన్నారు. భారత్‌లో జంబ్రొట్టాను చూసినందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదన్నాడు. భారత్‌లో కోచ్‌గా ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపాడు. ఆయన మంచి మేనేజర్‌గా రూపాంతరం చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు అభినందనలు చెప్పాడు.
ఒకనాటి ఇటలీ జట్టు సభ్యులుగా మాటరాజ్జీ, జాంబ్రొట్టాల శిక్షణకు ఇది పరీక్ష వంటిది. ఢిల్లీ డైనమోస్, చెన్నైయిన్ ఎఫ్‌సి మధ్య ఇంతకుముందు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో లయన్స్ రెండు గెలిస్తే ఒక మ్యాచ్ డ్రాగా ముగించారు. మరో మ్యాచ్ ఓటమి పాలైంది.