న్యూఢిల్లీ: భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టును ఈ ఏడాది చివరిలో నిర్వహించే యు-17 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ బలోపేతంచేస్తుందని జట్లు మిడ్ ఫీల్డర్ ఎవాగ్నేసన్ లింగ్డో వ్యాఖ్యానించాడు. భారత జట్టు ప్రగతి సాధించేందుకు ఇది చలా అవసరమని, సమర్థవంతమైన సీనియర్ల జట్టు తయారీకి ఇది దోహద పడుతుందని చెప్పాడు. యు-17 వరల్డ్ కప్ కు భారత్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఆతిథ్యం ఇస్తున్నాయి.
'భారత్‌లోని చిన్నారులకు ఫుట్ బాల్ ఆడేందుకు ఇది గొప్ప వేదిక. వారు సాధ్యమైనంత త్వరలో యూరప్ టోర్నీల్లోనూ పాల్గొంటారు' అని బుధవారం మీడియాతో చెప్పాడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎవాగ్నేసన్ లింగ్డో.. వచ్చే అక్టోబర్ లో జరిగే యు-17 జట్టులో సగానికి పైగా తదుపరి జరిగే వరల్డ్ కప్ టోర్నీకి భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుందన్నాడు. యు-17 ఫిఫా సాకర్ కప్ టోర్నీ నిర్వహణతో తొలుత దేశీయంగా ఫుట్ బాల్ పురోగతి సాధించేందుకు, జాతీయ జట్టుకు చేయూతనిచ్చేందుకు సహకరిస్తుందని చెప్పాడు.

'సహజసిద్ధంగానే యువకులు లబ్ధి పొందేందుకు తోడ్పాటునిస్తుంది. వారు ఇప్పటికే ఉన్నత ర్యాంక్ జట్లతో ఆడుతున్నారు. వారు టోర్నమెంట్‌లో తమ కంటే పెద్ద టీంలతో ఆడతారు. వారు తమకు కావాల్సిన కిటుకులు, నైపుణ్యం అంది పుచుకున్నారు. టోర్నీ ప్రారంభమైతే అది మెరుగవుతుంది' అని అన్నాడు. చిన్నప్పుడే వారు విలువైన అనుభవం ద్వారా తమకు అవసరమైన నాలెడ్జ్ పొందేందుకు అవకాశం ఉన్నదన్నాడు. వీరిలో కొందరు యూరప్ లో జరిగే టోర్నీలో పాల్గొంటారని తాను ఖచ్చితంగా చెప్పగలనన్నాడు.
వీరితో కలిసి ఆడటం వల్ల సీనియర్ ప్లేయర్లకు కూడా లబ్ది చేకూరుతుందని, తద్వారా సీనియర్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టుకు అర్హత లభిస్తుందన్నాడు. అయితే శుభారంభాన్ని అందుకోవాల్సి ఉన్నదన్నాడు. టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా చాలా అంశాల్లో భారత జట్టు తన పరిస్థితిని మెరుగుపర్చుకుంటుందని ఎవాగ్నేసన్ చెప్పాడు. ఇందుకు ప్రతి టోర్నీలోనూ ఫిఫా అటువంటి ప్రమాణాలను పాటిస్తుందని, భారత దేశంలోని వివిధ స్టేడియంలలో అటువంటి ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నదన్నాడు. ప్రత్యేకించి శిక్షణా మైదానాలు అభివ్రుద్ధి చేయాలని చెప్పాడు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జట్ల వెసులుబాటు కోసం ప్రాక్టీసింగ్ మైదానాలను అభివ్రుద్ది చేయాలని అన్నాడు. సమీప భవిష్యత్ లో అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అటువంటి ప్రమాణాలను కల్పిస్తుందని భావిస్తున్నానన్నాడు. ఈ పరిస్థితులన్నింటిని భారత జట్టు అనుసరిస్తే ముందుకు దూసుకెళ్లేందుకు వీలు చిక్కుతుందన్నాడు. మౌలిక వసతుల కల్పనపైనే భారత ఫుట్ బాల్ జట్టు పురోగతి ఆధార పడి ఉన్నదని ఎవాగ్నేసన్ లింగ్డో స్పష్టంచేశాడు.
గత కొన్ని నెలలుగా భారత్ ఫుట్ బాల్ లో ఉత్తేజకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయన్నాడు. సీనియర్ జట్టు ఫిఫా ర్యాంకింగ్స్ లో 134వ ర్యాంకుకు ఎగబ్రాకితే బెంగళూరు ఎఫ్ సి జట్టు ఏకంగా ఎఎఫ్ సి ఫైనల్స్ లో అడుగు పెట్టి భారత ఫుట్ బాల్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పిందని చెప్పారు. ఎఎఫ్ సి ఫైనల్స్ మ్యాచ్‌కు భారత క్లబ్ జట్టు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఫిఫా ర్యాంకింగ్స్ లో చూసినా భారత జట్టు ఎదుగుతున్నదని, స్థిరంగా ముందడుగు వేస్తున్నదని తెలిపాడు.
యు-17 వరల్డ్ కప్ నిర్వహణతో భారత జట్టు శక్తి సామర్థ్యాలను బహిర్గతంచేసేందుకు అవకాశాలు పెరుగుతాయన్నాడు. పదేపదే శక్తి సామర్థ్యాల ప్రదర్శనతో అనుభవం పెంపొందించుకునే అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు వెసులుబాటు లభిస్తుందన్నాడు. విశ్వాసం నింపుకుంటే జట్టులో వ్యక్తిత్వాన్ని బలోపేతంచేస్తుందన్నాడు. అది క్రమంగా ఆటగాళ్లు మెరుగైన ఆటతీరు ప్రదర్శనకు దారి తీస్తుందన్నాడు. ఉత్తమ ఆటగాళ్ల తయారీతో భారత్ ఫుట్‌బాల్‌కు మేలుచేస్తుందన్నాడు.