Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA U-17 World Cup: టాప్ 5 ప్లేయర్లు వీరే

హైదరాబాద్: సాకర్ చరిత్రలోనే భారత్ ఓ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) మెగా టోర్నీలో భారత్ తొలిసారి అరంగేట్రం చేస్తోంది. ఏ స్థాయిలోనైనా భారత్ తొలిసారి ఓ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యమిస్తోండటం ఇదే తొలిసారి. అంతేకాదు ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగుతోంది.

ప్రపంచంలో మరే క్రీడలో లేని మజా పుట్‌బాల్ మ్యాచ్‌లకు సొంతం. మ్యాచ్ మొదలైన నిమిషం నుంచి ఆఖరి క్షణం వరకు ఊపిరిబిగపట్టే క్షణాలు ఎన్నో ఉంటాయి. కళ్లుచెదిరే గోల్స్, మంత్రముగ్ధులను చేసే పాస్‌లు, ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించే ఎత్తుకు పైఎత్తులు, గోల్‌కీపర్ విన్యాసాలు ఇలా ప్రతిదీ మ్యాచ్ చూసే ప్రేక్షకుడిని అనుభూతికి గురి చేస్తాయి.

రెండు సంవత్సరాలకొకసారి జరిగే ఫిఫా వరల్డ్ కప్‌ను ఎలాగైనా ముద్దాడాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఆటగాళ్లు ఉంటారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా తరగని ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లుంటారు. భారత్‌లో జరిగే ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో సంచలనాలు సృష్టించే కొంత మంది యువ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

జాడెన్ సాంచో(ఇంగ్లండ్)

జాడెన్ సాంచో(ఇంగ్లండ్)

ఇంగ్లండ్ యువ జట్టులోకి దూసుకొచ్చాడు. మాంచెస్టర్ సిటీ క్లబ్ నుంచి జర్మనీ ప్రముఖ సాకర్‌క్లబ్ బోరుసియా డార్ట్‌మండ్‌కు మారడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఏకంగా 10మిలియన్ పౌండ్లకు డార్ట్‌మండ్ క్లబ్ జాడెన్‌ను తమ సొంతం చేసుకుంది. అప్పటిదాకా స్టార్ ప్లేయర్ ఔస్‌మన్నె డెంబ్లే ధరించిన ఏడో నంబర్ జెర్సీని జాడెన్‌కు ఇవ్వడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. మిలియన్ పౌండ్ల ధర పలకడానికి ముందు సాంచో యూరోఅండర్-17 చాంపియన్‌షిప్‌లో మెరుపులు మెరిపించాడు. ఐదు గోల్స్ చేయడంతో పాటు మరో ఐదు గోల్స్ కావడంలో కీలకమై ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకమయ్యాడు. అంతేకాదు కళ్లు చెదిరే గోల్స్‌తో గోల్డెన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.

అమ్నె గుయోరీ (ఫ్రాన్స్)

అమ్నె గుయోరీ (ఫ్రాన్స్)

మాంచెస్టర్ యునైటెడ్, జువెంటస్, చెల్సియా లాంటి ప్రముఖ సాకర్ క్లబ్‌లు అమ్నె గుయోరీపై కన్నేశాయి. తన అద్భుత సాకర్ నైపుణ్యంతో ఫ్రాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. యూరో అండర్-17 చాంపియన్‌షిప్‌లో ఎనిమిది గోల్స్‌తో అమ్నె సత్తా చాటాడు. క్రొయేషియాలో జరిగిన ఈ టోర్నీలో ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. అంతేకాదు హంగేరీతో జరిగిన అండర్-17 ప్రపంచకప్ ప్లేఆఫ్స్‌లో ఏకైక గోల్‌తో ఫ్రాన్స్‌ను గెలిపించి వరల్డ్‌కప్ బెర్తు దక్కేలా చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

జాన్ ఫీటె (జర్మనీ)

జాన్ ఫీటె (జర్మనీ)

బుందుస్‌లీగాలో జాన్ ఫీటె చరిత్ర సృష్టించాడు. 21వ శతాబ్దంలో పుట్టి జర్మన్ టాప్‌టైర్ ఫుట్‌బాల్ లీగ్‌లో ఆడిన తొలి ఆటగానిగా జాన్ నిలిచాడు. దీంతో యూరో అండర్-17 చాంపియన్‌షిప్‌లో అతని ఆటను చూసిన హంబర్గ్ క్లబ్ కాంట్రాక్టును 2019 వరకు పొడిగించుకుంది. మరోవైపు క్రొయేషియాలో జరిగిన టోర్నీలో జాన్ రెండు హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించాడు. బోస్నియా ఆండ్ హెర్జగోవినాపై తొలి హ్యాట్రిక్ కొట్టగా, ఐర్లాండ్‌పై మరోటి నమోదు చేశాడు. రొనాల్డో, మెస్సీ మాయ నడుస్తున్న ప్రస్తుత కాలంలో హ్యారీ కేన్(ఇంగ్లండ్) తన అభిమాన ఆటగాడు అని ఒక ఇంటర్వ్యూలో జాన్ పేర్కొనడం విశేషం.

అబెల్ రుయిజ్ (స్పెయిన్)

అబెల్ రుయిజ్ (స్పెయిన్)

ప్రముఖ లా మాసియా(బార్సిలోనా అకాడమీ) సానబెట్టిన ఆటగాడు అబెల్ రుయిజ్. ప్రస్తుతం బార్సిలోనా బి జట్టు తరఫున ఆడుతున్నాడు. 2015 నుంచి స్పెయిన్ తరఫున అండర్-17 టోర్నీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న రుయిజ్ ఇప్పటివరకు 19 గోల్స్ సాధించాడు. యూరో అండర్-17 చాంపియన్‌షిప్‌లో స్పెయిన్ జట్టుకు నాయకత్వం వహించాడు.

జోష్ సార్జెంట్(అమెరికా)

జోష్ సార్జెంట్(అమెరికా)

ప్రస్తుత వరల్డ్ కప్‌లో అమెరికా తరఫున మెరుపులు మెరిపించేందుకు స్రైక్టర్ జోష్ సార్జెంట్ సిద్దమయ్యాడు. ఇప్పటికే కొరియాలో జరిగిన అండర్-20 ప్రపంచకప్‌లో అమెరికాకు ఆడిన జోష్.. రెండోసారి మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్నాడు. ఈక్వెడార్‌తో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టి టోర్నీ చరిత్రలోనే పిన్న వయస్సులో ఈ ఫీట్ అందుకున్న తొలి అమెరికన్‌గా నిలిచాడు. అంతేకాదు ఐదు గోల్స్‌తో అమెరికా జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో సార్జెంట్ కీలకమయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+