
హైదరాబాద్: ఇరాన్ ప్రభుత్వం సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఇరాన్‌లో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను నాలుగు దశాబ్దాల తర్వాత మహిళల్ని అనుమతించనున్నారు. నిజానికి ఇరాన్‌లో గత 40 ఏళ్ల నుంచి ఫుట్‌బాల్ స్టేడియాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు.
మహిళల స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న నిబంధనలను సవరించకపోతే ఇరాన్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి బహిష్కరిస్తామని ఫిఫా హెచ్చరించడంతో మహిళా అభిమానులను సైతం స్టేడియాల్లోకి అనుమతించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం ఇరాన్-కంబోడియా జట్ల మధ్య 2022 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్ అజాదీ స్టేడియంలో జరగనుంది.
ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరాన్ మహిళలు సందడి చేయబోతున్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన గంటలోనే అయిపోయాయని... వేల సంఖ్యలో అమ్మాయిలు టికెట్లు కొన్నట్లు ఫిఫా తెలిపింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి చూడడానికి మహిళలకు కూడా అనుమతిస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.