
హైదరాబాద్: కన్నుల పండుగ సాగుతున్న ఫిఫా సమరంలో.. విచిత్రాలకు ఏ మాత్రం కొదవలేకుండాపోతుంది. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో ఇటీవలే ఓ కారు అనుకోకుండా.. ఫుట్‌బాల్ అభిమానుల మీదికి దూసుకెళ్లింది. హఠాత్పరిణామంతో.. ఏడుగురు గాయాలకు గురైయ్యారు. వీళ్లలో మెక్సికో టీమ్ అభిమానులు కూడా ఉన్నారు. వీళ్లంతా సాకర్ వరల్డ్‌కప్ కోసమే రష్యా వచ్చారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
కిర్గిస్థాన్ లైసెన్స్ ఉన్న ఆ ముస్లిం డ్రైవర్ సోవియట్ రిపబ్లిక్ మాజీ పౌరుడు. అనుకోకుండా జరిగిందే కానీ, తాను కావాలని జనంపైకి కారును తీసుకెళ్లలేదని అతడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మెక్సికన్ జెర్సీలు ధరించిన అభిమానులపైకి ఈ కారు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆదివారం రోజు జర్మనీతో తమ తొలి మ్యాచ్‌లో మెక్సికో తలపడబోతుంది.
లుజ్నికి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ చూడటానికే వేల మంది మెక్సికో అభిమానులు మాస్కో వచ్చారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా.. అక్కడున్నవాళ్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అది నేను కాదు అని ఆ డ్రైవర్ అరచినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఆ సమయంలో అతను మద్యం తాగినట్లు కనిపించలేదని అన్నాడు.
గాయపడిన వాళ్లంతా కోలుకుంటున్నారని, ఎవరికీ అంత తీవ్రమైన గాయాలు కాలేదని ఇంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటికే ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవడంతో ఇలాంటి పరిణామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్వహక సంఘం వెల్లడించింది. దీంతో ఈ ఘటన తర్వాత భద్రతను మరింత పెంచుతూ.. చర్యలు చేపట్టారు.