
హైదరాబాద్: భారత పుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ఓ అద్భుతమే చేశాడు. కేవలం క్రికెట్‌ను మాత్రమే అమితంగా ప్రేమించే అభిమానులు ఇకపై, పుట్‌బాల్ వైపు కూడా మళ్లనున్నారు. ఈ క్రమంలో భారత పుట్‌బాల్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.
'తిట్టండి... విమర్శించండి.. కానీ మైదానాలకు వచ్చి భారత ఫుట్‌బాల్ జట్టు ఆట చూడండి' అంటూ భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఛెత్రి పిలుపునకు బాగానే స్పందన వస్తోంది.
ముంబై వేదికగా జరుగుతున్న ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా సోమవారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌కు అభిమానులు స్టేడియానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కొన్ని గంటల ముందు నిర్వాహకులు టిక్కెట్లన్నీ అమ్ముడుపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ టోర్నీలో భారత్ ఆడే మిగతా రెండు మ్యాచ్‌లకు సంబంధించి టిక్కెట్లు కూడా అమ్ముడుపోయినట్లు బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. టోర్నీలో భాగంగా గురువారం భారత్ తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. చెనీస్‌తైపీ, కెన్యా జట్లపై నెగ్గడంతో భారత్ ఇప్పటికే ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది.
టోర్నీలో భాగంగా జూన్ 10న ముంబైలోని ఫుట్‌బాల్ ఎరీనా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అభిమానుల కోసం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దీంతో ఈ రెండు మ్యాచ్‌ల కోసం ఉంచిన టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడుపోయినట్లు టోర్నీ నిర్వాహకులు తెలిపారు.
భారత్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా చెనీస్‌తైపీతో గత శుక్రవారం జరిగిన మ్యాచ్‌కి కేవలం రెండు వేల మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఛెత్రి పుట్‌బాల్ మ్యాచ్‌లను కూడా మైదానాలకు వచ్చి వీక్షించాల్సిందిగా అభిమానులను ట్విట్టర్ వేదికగా కోరాడు
ఛెత్రి ఆవేదనను అర్ధం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువరు క్రికెట్‌తో పాటు పుట్‌బాల్‌ని కూడా అభిమానులు ఆదరించాలని ట్విట్టర్‌లో వీడియో ద్వారా కోరారు. దీంతో సోమవారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైన సంగతి తెలిసిందే.