జొహానెస్ బర్గ్: ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో పరాగ్వేపై స్పెయిన్ అతి కష్టంగా గట్టెక్కింది. అలవోకగా గెలుస్తుందనుకున్న స్పెయిన్ చెమటోడ్చవలసి వచ్చింది. శనివారం రాత్రి నాటకీయంగా సాగిన మ్యాచ్ లో 1-0తో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. స్పెయిన్ ప్రపంచకప్ సెమీస్ చేరడం ఇదే తొలిసారి. డేవిడ్ విల్లా 83వ నిమిషంలో గెలుపు గోల్ కొట్టాడు. స్పెయిన్ ధాటికి నిలవలేదనుకున్న పరాగ్వే..గట్టి పోటీనిచ్చింది. రిఫరీ తప్పుడు నిర్ణయంతో పరాగ్వే ఆధిక్యం సాధించే అవకాశం కోల్పోయింది. 42 నిమిషంలో నెల్సన్ వాల్డెజ్ గోల్ కొట్టినా..రిఫరీ పొరబాటుగా ఆఫ్ సైడ్ ప్రకటించాడు.
59వ నిమిషంలో పెనాల్టీ కిక్ రూపంలో పరాగ్వేకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఐతే కార్డోసో కిక్‌ను గోల్‌కీపర్ కాసిలాస్ అద్భుతంగా అడ్డుకోవడంతో స్పెయిన్ బతికి పోయింది. మూడు నిమిషాలకే మరో పెనాల్టీ. ఐతే ఈసారి అవకాశం స్పెయిన్‌ది. అలోన్సో నేర్పుగా బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుంటే...అది గోల్ కాదంటూ రిఫరీ బాంబు పేల్చాడు. అలోన్సో బంతిని తన్నడానికి ముందే..మరో స్పెయిన్ ఆటగాడు 'డి' ప్రాంతం లోపలికి రావడంతో గోల్‌ను అనుమతించలేదు.
ఐతే రెండోసారి అలోన్సో కిక్ ను పరాగ్వే గోల్ కీపర్ విల్లార్ ఒడిసి పట్టుకున్నాడు. మ్యాచ్ అదనపు సమయానికి దారితీస్తుందని అనుకుంటుండగా... 83వ నిమిషంలో స్పెయిన్ అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గోల్‌లోనూ నాటకీయతే. ఇనియెస్టా కొట్టిన షాట్ క్రాస్ బార్‌ను తగిలి పక్కకు రాగా..అక్కడే పొంచి ఉన్న విల్లా తెలివిగా గోల్‌పోస్టువైపు మళ్లించాడు. ఈసారీ బంతి క్రాస్ బార్‌ను తగిలినా గోల్‌పోస్ట్ లోపలికి వెళ్లింది.