జొహన్నెస్ బర్గ్: పరాగ్వేపై విజయం సాధించి స్పెయిన్ సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఫుట్ బాల్ ప్రపంచ కప్‌లో యూరో చాంప్స్ స్పెయిన్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. స్టార్ స్ట్రయికర్ డేవిడ్ విల్లా మరోసారి సత్తా చాటుకున్నాడు. శనివారం స్థానిక ఎలిస్ పార్క్ లో పరాగ్వేతో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 1-0తో విజయం సాధిం చింది. తద్వారా అరవయ్యేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సెమీస్ లోకి అడుగుపెట్టిన ఈ స్పానిష్ జట్టు బుధవారం జర్మనీతో అమీ తుమీ తేల్చుకోనుంది. ఆట ప్రథమార్థంలో ఇరు జట్ల నుంచి గోల్స్ నమోదు కాలేదు.
ద్వితీయార్థంలో స్పెయిన్ వ్యూహం మార్చింది. ప్రత్యర్థిపై ఎదురుదాడి సాగించి చక్కని సమన్వయం తో జట్టు రాణించింది. 59వ నిమిషంలో పరాగ్వేకు, 63వ నిమిషంలో స్పెయిన్‌కు లభించిన పెనాల్టీ కిక్స్ సైతం వృధా అయ్యాయి. చివరకు 83వ నిమిషంలో స్టార్ స్ట్రయికర్ డేవిడ్ విల్లా సూపర్ గోల్ తో స్పెయిన్ 1-0తో ఊపిరి పీల్చుకుంది. దీంతో ప్రపంచ కప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గోల్ చేసిన తొలి స్సెయిన్ ఆటగాడిగా విల్లా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా ఈ టోర్నీలో తనకు ఇది ఐదో గోల్.