
హైదరాబాద్: స్వచ్ఛ భారత్ మన దేశం దాటిపోయిందా అన్నట్లుగా ఉందీ వీడియో..! సాధారణంగా ఏదైనా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్తే తినుబండారాలను తినేసి చెత్త అక్కడే పడేస్తాం. శుభ్రంగా ఉండాలంటే అక్కడ ఏదైనా చెత్త డబ్బా ఉంటే అందులో వేసేస్తాం. కానీ, ఇక్కడ దానికి రివర్స్‌గా జరిగింది. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులే స్టేడియాన్ని శుభ్రం చేసుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదెక్కడ జరిగిందంటే.. కొద్ది రోజుల ముందే రష్యాలో ఫిఫా ప్రపంచకప్ పోటీలు మొదలై అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. టోర్నీలో భాగంగా మంగళవారం పోలెండ్-సెనెగల్ మధ్య మ్యాచ్ జరిగింది. సెనెగల్ జట్టుకు మద్దతిచ్చేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైదానంలో ఓ గ్యాలరీలో కూర్చున్నారు.
ఆద్యంతం మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. మధ్యలో ఆకలేసినప్పుడు కావాల్సినవన్ని తిన్నారు. తమ అభిమాన జట్టు గోల్ కొట్టినప్పుడుల్లా కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఈ మ్యాచ్‌లో సెనెగల్ 2-1 తేడాతో పోలెండ్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం మిగతా అభిమానుల్లా సెనెగల్ అభిమానులు వెళ్లిపోలేదు. సిబ్బందికి శ్రమ తగ్గించాలనుకున్నారో.. లేదా తమ వల్ల జరిగిన దాన్ని వాళ్లే శుభ్రం చేద్దామనుకున్నారో..
తాము కూర్చున్న ప్రదేశంలో ఉన్న కాగితాలు, కూల్‌డ్రింక్స్, మంచినీళ్ల బాటిల్స్‌ను వారు ఏరిపారేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు వారి చేసిన పనిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.