
తిట్టండి.. మైదానాలకు వచ్చి చూడండి
‘మమ్మల్ని తిట్టండి. విమర్శించండి. కానీ దయచేసి భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఆడుతుంటే మైదానాలకు వచ్చి చూడండి' అని ఛెత్రి ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆటతీరులో గతంలో కంటే క్రమంగా మెరుగవుతూ.. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 97వ స్థానంలో ఉన్న భారత ఫుట్‌బాల్ జట్టు శుక్రవారం మొదలైన నాలుగు దేశాల టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో 5-0 తేడాతో చైనీస్ తైపీపై ఘన విజయం సాధించింది.

2000 మంది అభిమానులు మాత్రమే
ఈ మ్యాచ్‌కు కేవలం 2000 మంది అభిమానులు మాత్రమే హాజరవడంతో ముంబైలోని ఫుట్‌బాల్ ఎరీనా స్టేడియం బోసిపోయి కనిపించింది. ఛెత్రి అద్భుతంగా రాణించి హ్యాట్రిక్‌తో జట్టుకు విజయాన్ని అందించినా అతడిలో ఆనందం కనిపించలేదు. దానికి కారణం ఫుట్‌బాల్ జట్టుకు ప్రజల నుంచి తగిన ఆదరణ లభించకపోవడమే.

ఆటతీరులో వారి స్థాయిని అందుకోకపోవచ్చు
‘యూరోపియన్ క్లబ్‌లను అనుసరిస్తూ వారికి మద్దతు తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటతీరులో మేం వారి స్థాయిని అందుకోకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి సమయం ఎందుకు వృథా చేసుకోవాలని మీకు అనిపించి ఉండొచ్చు. దాన్ని మేం కాదనట్లేదు. ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని మేం కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతామని మాత్రం చెప్పగలనని' నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

ఫుట్‌బాల్ జట్టు మీద నమ్మకం కోల్పోయిన మీరు:
'మీకు సరైన వినోదాన్ని అందిస్తాం. భారత ఫుట్‌బాల్ జట్టు మీద నమ్మకం కోల్పోయిన మీరు ఒక సారి స్టేడియానికి వచ్చి మా ఆట చూడండి. అంతర్జాలంలో మమ్మల్ని దూషించడం సరికాదు. మైదానాలకు రండి. మా ముఖం మీదే తిట్టండి. మా మీద అరవండి. మీ ప్రవర్తనలో ఒక రోజు మార్పు రావొచ్చు. మీ మద్దతు మాకు ఎంత అవసరమో మీరు తెలుసుకోలేకపోతున్నారు' అని ఛెత్రి వివరించాడు.


Click it and Unblock the Notifications














