
హైదరాబాద్: ఒకేసారి తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను బ్రెజిల్ మాజీ సాకర్ స్టార్ రొనాల్డినో ఖండించాడు. ఇదో పెద్ద అబద్ధం అని అతను స్పోర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 38 ఏళ్ల రొనాల్డినో ఆగస్టులో తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌నూ ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విషయానికి బ్రెజిల్‌కు చెందిన దినపత్రిక ఒ డియా వెల్లడించింది. తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ ప్రిసిల్లా కొయెలో, బీట్రిజ్ సౌజాలను రొనాల్డినో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ పత్రిక తెలిపింది. గత డిసెంబర్ నుంచి ఈ ముగ్గురూ కలిసే ఉంటున్నట్లు వెల్లడించింది. రియోలోనే జరిగే ఓ ప్రైవేటు వేడుకలో రొనాల్డినో ఈ ఇద్దరిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిపింది.
కాగా, ప్రిసిల్లాతో 2013 నుంచి, బీట్రిజ్‌తో 2016 నుంచి రొనాల్డినో డేటింగ్ చేస్తున్నాడు. జనవరిలోనే పెళ్లికి ఒప్పించిన రొనాల్డినో.. వారికి ఎంగేజ్‌మెంట్ ఉంగరాలు కూడా తొడిగాడని, చేతి ఖర్చులకు గాను వీరికి చెరో 1500 పౌండ్లు (సుమారు రూ. 1.37 లక్షలు) ఇస్తున్నాడని తెలిపింది.
అయితే ఈ పెళ్లి ఇష్టం లేని రొనాల్డినో సోదరి.. తాను వేడుకకు హాజరు కాబోనని కూడా చెప్పినట్లు మరికొన్ని వార్తలు వచ్చాయి. తనపై వచ్చిన వార్తలన్నీ అబద్ధమని రొనాల్డినో పేర్కొన్నాడు. కాగా, బ్రెజిల్ జాతీయ జట్టు తరపున 97 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డినో.. 37 గోల్స్ చేశాడు. రెండుసార్లు ఫిఫా వరల్డ్‌కప్‌నకు ప్రాతినిథ్యం వహించాడు.
2002 వరల్డ్‌కప్ నెగ్గిన బ్రెజిల్ జట్టులో రొనాల్డినో సభ్యుడు. లేట్‌నైట్ పార్టీలు, అమ్మాయిలతో డేటింగ్ వ్యవహారాలు అతని కెరీర్ దిగజారడానికి కారణాలయ్యాయి. బార్సిలోనా తరపున 2003 నుంచి 2008 వరకు ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సోదరుడి ద్వారా రోనాల్డిన్హో రిటైర్‌మెంట్ ప్రకటన చేయించాడు.