
హైదరాబాద్: 2018లో ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించిన జెర్సీని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ధరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని రోహిత్ శర్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ రోహిత్ శర్మ ధరించిన జెర్సీ ఏ దేశానిది అనుకుంటున్నారా!
వచ్చే ఏడాది జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో స్పెయిన్ జట్టు ధరించే జెర్సీ ఇది. స్పెయిన్ జాతీయ పుట్‌బాల్ జట్టు ఈ జెర్సీని ప్రత్యేకంగా రోహిత్ శర్మకు పంపించింది. దీనిని అందుకున్న రోహిత్ శర్మ జెర్సీని ధరించిన ఫొటోను అభిమానులతో పంచుకుని 'ఈ జెర్సీ ఇప్పుడే అందింది. వరల్డ్‌కప్ టోర్నీలో స్పెయిన్ రాణించాలి' అని కామెంట్ పెట్టాడు.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ రియల్ మాడ్రిడ్‌కు వీరాభిమానిని అని చెప్పాడు. ఆ జట్టు ఎంతో దూకుడుగా ఆడుతుందని, ఆ స్వభావం అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. తాను ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ను ఫాలో అవుతానని అయితే అన్ని మ్యాచ్‌లు చూడాలంటే కుదరదని తెలిపాడు.
ప్రతి రోజూ జిమ్, ట్రైనింగ్ ముగిసిన తర్వాత కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడతానని, ఫుట్‌బాల్ ఆడితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. తన స్నేహితులతో కలిసి ఫాంటసీ లీగ్ ఆడతానని, స్పెయిన్ జట్టులోని ఫెర్నాండో టారిస్ తన అభిమాన క్రీడాకారుల్లో ఒకడని తెలిపాడు.
స్పెయిన్ జట్టు జెర్సీని ధరించాను కానీ ఫెర్నాండో టారిస్ వ్యక్తిగత జెర్సీని ధరించే అవకాశం తనకు ఇంకా రాలేదని రోహిత్ శర్మ తెలిపాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రోహిత్ శర్మ నవంబర్ 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదిక శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు సన్నద్ధమవుతున్నాడు.