
హైదరాబాద్: క్రికెట్, ఫుట్‌బాల్ ఇలా ఏ క్రీడలో అయినా ఆటగాళ్లు వారి వ్యక్తిగత స్వభావాన్ని బట్టి టాటూలు వేయించుకుంటారు. ఇలాగే ఓ ఫుట్‌బాలర్ ఆటగాడు తన కాలిపై వేసుకున్న టాటూ వివాదాస్పదంగా మారింది. వెంటనే ఆ టాటూ తొలగించకపోతే.. ప్రపంచకప్ ఆడేందుకు అనుమతి ఇవ్వొద్దని రష్యావాసులు సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
మరో 15 రోజుల్లో ఫిఫా పుట్‌బాల్ మహా సమరం ప్రారంభంకానుంది. ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలు రష్యాలో జరిగే ప్రపంచకప్‌లో పోటీపడుతున్నాయి. ఇప్పటికే జట్లన్ని రష్యా చేరుకుని కసరత్తులు మొదలుపెట్టాయి. షెడ్యూల్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు కూడా ప్రాక్టీస్‌లో పాల్గొంది. ఆ జట్టులోని రహీమ్ స్టెర్లింగ్ అనే ఆటగాడి కుడి కాలిపై ఉన్న టాటూకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ టాటూ ఏంటంటే... తుపాకీ. మారణాయుధాన్ని టాటూగా వేసుకుని ప్రపంచకప్‌లో పాల్గొనడం సరికాదు అంటూ పలువురు సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తుపాకీ వాడకానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతోన్న లూపీ కోప్ మాట్లాడుతూ...'వీలైనంత త్వరగా రహీర్ తన కాలిపై ఉన్న టాటూను తొలగించుకోవాలి. లేదంటే అతన్ని ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతించొద్దు' అని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఆటగాడి ఆలోచన ప్రకారం.. 'రెండేళ్ల వయస్సున్నప్పుడు తుపాకీ కాల్పు జరపడం వల్లే మా నాన్నను కోల్పోయా. నేనిక తుపాకీ పట్టుకోకూడాదని షూటింగ్‌కు దూరంగా ఉందామని అనుకున్నా. ఇప్పుడు షూటింగ్ చేస్తున్నా. తుపాకీతో కాదు. నా కుడి కాలితో. ఇది పూర్తి కాలేదు' అని తన కుడి కాలిపై ఉన్న టాటూ చూపిస్తున్నాడు.