ఐఎస్ఎల్: కసిగా ఆడారు.. ఆర్తి తీరింది
పుణె: ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్‌లో రెండో విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూసిన పుణె కుర్రాళ్లు కసిగా ఆడారు. అట్లెటికో డీ కోల్‌కతాపై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి పోయారు. పోరాట పటిమ అంటే ఎలా ఉంటుందో రుచి చూపారు. అద్యంతం బంతిపై పట్టు కొనసాగిస్తూ మాజీ చాంపియన్లకు చుక్కలు చూపారు. దీంతో అట్లెటికో డీ కోల్ కతాపై 2 - 0 స్కోర్ తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఒక మెట్టు పైకెక్కేశారు.
ఇరు జట్లు కూడా మ్యాచ్ అద్యంతం గోల్ పాయింట్ సాధించేందుకు గల ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నా సఫలం కాలేదు. అయితే తొలి దశలో గోవాపై జరిగిన మ్యాచ్ తర్వాత ఈ సీజన్‌లో పుణె మళ్లీ గెలుపొందడం ఇదే. అదీ కూడా పుణె సొంతగడ్డపై ఆ జట్టు ఈ ఏడాది గెలిచిన తొలి మ్యాచ్ ఇది. దీంతో పుణె కోచ్ అంటోనియో హబాస్ పూర్తిగా ఆనంద పరవశంలో మునిగిపోయారు.
ఈ మ్యాచ్‌లో గెలుపొందిన టేబుల్‌లో మరో మూడు పాయింట్లు పొందాలన్న కోల్‌కతా తపన వరుసగా రెండోమ్యాచ్‌లోనూ నెరవేరలేదు. దీంతో కోచ్ మొలీనా అసంత్రుప్తి వ్యక్తంచేశాడు. పుణె బాయ్ ఎడుయారో ఫెరీరా 41వ నిమిషంలో కార్నర్ ద్వారా తొలి గోల్ చేశాడు. సెకండాఫ్‌లో 56వ నిమిషంలో అనిబల్ రోడ్రిగ్స్ చేసిన రెండో గోల్‌తో పుణె 2 - 0 లీడ్‌తో పట్టు సాధించింది.
దీంతో కోల్‌కతాపై ఒత్తిడి పెరిగింది. కోల్ కతా అటాకర్ ఇయాన్ హుమ్ 69వ నిమిషంలో గోల్ కీపర్ వెనుకకు పంపిన బంతిని మళ్లీ గోల్ పోస్ట్‌కు పంపినా గంగూలీ ఫ్రాంచైసీ జట్టు రెండో మ్యాచ్ పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో మరో విశేషమేమిటంటే ఇరు జట్ల సారధులు తొలి దశలోనే గోల్ పాయింట్ సాధించేందుకు విఫల యత్నంచేశారు.

కిక్ షాట్ వైడ్‌గా మారిన వైనం
పుణె సారధి మహ్మద్ సిస్సోకో మ్యాచ్ ప్రారంభమైన నిమిషంలోనే కొట్టిన కిక్ షాట్‌వైడ్‌గా మారి వెళ్లిపోయింది. ఇక కోల్ కతా కెప్టెన్ హెల్డర్ పొస్టిగ దూరం నుంచి కొట్టిన షాట్‌ను పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటె నెట్ పక్క నుంచి వెనుకకు తిరగ్గొట్టాడు. అంతకుముందు ఎడుయారో ఫెరీరా 19వ నిమిషంలో కార్నర్ నుంచి గోల్ పోస్ట్ లక్ష్యంగా పంపిన బంతిని.. కీపర్ స్టీఫెన్ పియర్సన్ అడ్డుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన అర్థగంట దాటిన తర్వాత జొన్నాథన్ లుక్కా 21వ నిమిషంలో తన లక్ పరీక్షించుకునేందుకు కొట్టిన గోల్ వైడ్‌గా మారి వెళ్లిపోయింది.

అందివచ్చిన అవకాశం
ఫస్టాఫ్ కు నాలుగు నిమిషాల ముందు రెండోసారి ఫెరీరా తనకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా కార్నర్ నుంచి కొట్టిన షాట్‌తో బంతి నేరుగా గోల్ పోస్ట్‌లో చేరిపోయింది. కానీ గోల్ తర్వాత గాయపడటంతో ఫెరీరా మ్యాచ్ తర్వాత వైదొలగాల్సిన పరిస్థతి తలెత్తెంది. బ్రేక్ కు ముందే జొన్నాథన్ లుక్కా కొట్టిన ఫ్రీకిక్ బంతిని కోల్ కతా విజయవంతంగా అడ్డుకోవడంతో పుణె 1 - 0 స్కోర్ ఆధిక్యం సాధించింది. అంతకుముందు కోల్‌కతా సారధి పొస్టిగ కొట్టిన షాట్ కార్నర్ మీదుగా గోల్ పోస్ట్‌ను దాటుకుని వెళ్లిపోయింది. సెకండాఫ్‌లో 11 నిమిషాల తర్వాత పుణె మరోసారి అడ్వాంటేజ్‌గా తీసుకున్నది.

2 గోల్స్‌తో లీడ్ సాధించిన పుణె
బంతిని చేత్తో అడ్డుకున్నందుకు ప్రీతం కొట్టల్‌కు రిఫరీ ఎల్లో కార్డు చూపిన తర్వాత రోడ్రిగ్స్ కొట్టిన కిక్ నేరుగా కీపర్ దేబ్జిత్ మజుందార్‌ను ఏమార్చి గోల్ పోస్ట్‌కు చేరడంతో 2 గోల్స్‌తో పుణె లీడ్ సాధించింది. అప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు కోల్ కతా స్కోర్ సమం చేయడానికి విశ్వ ప్రయత్నాలుచేసింది. కోల్‌కతా జట్టులో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బిద్యానంద సింగ్ పాయింట్ల తేడాను తగ్గించేందుకు 66వ నిమిషంలో కొట్టిన బంతిని పుణె కీపర్ ఎడెల్ బిడె విజయవంతంగా అడ్డుకున్నాడు.

అంతేకాదు ప్రమాదం ముంచుకొస్తుండటంతో వెంటనే
అప్రమత్తమై బంతిని సేవ్ చేశాడు. మ్యాచ్ సమయం ముగిసిన తర్వాత కూడా విజిటర్స్‌కు మరో రెండు నిమిషాల సమయం ఇచ్చినా కోల్‌కతా వినియోగించుకోలేకపోయింది. సిస్సోకో చేసిన ఫౌల్‌ను పెనాల్టీగా మార్చుకునేందుకు ఇచ్చిన చాన్స్ వినియోగించుకోవడంలో పొస్టిగ విఫలమయ్యాడు. మ్యాచ్ చివరి 20 నిమిషాల్లో కోల్‌కతా ఆటగాళ్లు అవిశ్రాంతంగా ఫార్వర్డ్ లైన్‌పై అటాకింగ్‌కు ప్రయత్నించారు. 72వ నిమిషంలో పొస్టిగ సుదూరం నుంచి కొట్టిన స్టింగింగ్ షాట్‌ను బెటె అడ్డుకుని తమ జట్టు లీడ్‌ను యథాతథంగా కొనసాగించాడు.

కోల్‌కత్తాకు రెండో ఓటమి
చివరిగా హెన్రిక్ సెరెనో తనకు తాను గుర్తించిన ఫార్వర్డ్ తో సమయం కలిసొచ్చినా బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించలేకపోయాడు. హెడ్డర్ ద్వారా సరిగ్గా పంపక పోవడంతో పుణె కుర్రాడు రాహుల్ భెకె అడ్డుకోవడంతో కోల్ కతా రెండో ఓటమి ఖరారైంది. తద్వారా పుణె సెమీస్ పై ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలవ్వడంపై కోల్ కతా సారధి హెల్డర్ పొస్టిగ అసంత్రుప్తి వ్యక్తంచేశాడు. సెకండాఫ్ లో మరో గోల్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించాడు. కానీ తాము సెమీస్ లోకి వెళ్లాలంటే మున్ముందు పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నాడు. గత రెండేళ్లు హబాస్ తమ జట్టుకే కోచ్ గా వ్యవహరించాడని పొస్టిగ గుర్తుచేశాడు.

సెమీస్‌కు అర్హత సాధించడం అత్యంత కీలకం
ఇయాన్ హుమ్ గోల్ పై స్పందిస్తూ ఎవరు గోల్ చేశారన్నది ముఖ్యం కాదని, జట్టు చాలా ముఖ్యమైందని, తాము సెమీస్‌కు అర్హత సాధించడం అత్యంత కీలకమని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే తాను చేసిన గోల్‌తోనే జట్టు విజయం సాధించడంపై రోడ్రిగ్స్ పూర్తిగా సంతోషంలో మునిగిపోయాడు. సొంతగడ్డపై తాము గెలుపొందడం ఆనందంగా ఉన్నదని, సెమీస్ లో ప్రవేశించేందుకు ఇదే దూకుడు ప్రదర్శించాల్సి ఉంటుందన్నాడు. తాను పంపిన బంతిని గోల్ కీపర్ అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications