హైదరాబాద్: అవకాశాలను అందిపుచ్చుకుని భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగాలని భారత యువ సాకర్ ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హితబోధ చేశారు. భారత్ వేదికగా జరిగిన అండర్-17 ఫిఫా ప్రపంకప్‌లో భారత్ జట్టు అంచనాలకు మించి రాణించిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలోని మేటి జట్లకు పోటినిస్తూ మన యువ ఆటగాళ్లు సత్తాచాటారని ఈ సందర్భంగా మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ముగించుకుని సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన యువ భారత్ జట్టు శుక్రవారం ప్రధాని మోడీని కలిసింది.
ఈ సందర్భంగా ప్రధాని ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే వ్యాఖ్యలు చేశారు. అండర్-17 ప్రపంచకప్ ద్వారా మీ ప్రతిభ ఏంటో అందిరికి తెలిసొచ్చిందని అన్నారు. 'రాబోయే 5-7 ఏళ్లు ఇదే రీతిలో నిలకడగా రాణించి దేశం ఖ్యాతిని మరింత ఇనుమడింపచేయాలి. మీ భుజస్కంధాలపై ఆ బాధ్యత ఉంది' అని మోడీ అన్నారు.
యువ భారత జట్టు ప్రధాని మోడీని కలిసి సందర్భంలో కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాధోడ్ కూడా పక్కనే ఉన్నారు. ఫిఫా యు-17 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అమెరికాతో జరిగిన తొలి పోరుకు ప్రధాని మోడీ కూడా హాజరైన సంగతి తెలిసిందే.