ఓ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ రికార్డ్ బ్రేకింగ్ డీల్ తో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. తాజా అగ్రీమెంట్ తో అతడు ఊహకందని రీతిలో మరో పదేళ్ల పాటు వారానికి రూ. 5 కోట్ల చొప్పున ఆర్జించనున్నాడు. ఇంతకీ అతడెవరంటే?
నార్వే ఫుట్‌బాల్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్ గురించి ఫుట్‌బాల్ లవర్స్ కు తెలిసే ఉంటుంది. 2000 సంవత్సరంలో జన్మించిన ఎర్లింగ్ హాలాండ్.. నార్వే జాతీయ జట్టు తరఫున ఆడుతోన్న సంగతి తెలిసిందే. అతడు ఇంగ్లాండ్ లో జరిగే ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడుతున్నాడు. ఈ లీగ్ అరంగేట్రంలోనే పలు రికార్డులను బ్రేక్ చేసిన హాలాండ్.. తొలి సీజన్‌లోనే 36 గోల్స్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. అనంతరం గత సీజన్‌లో మాంచెస్టర్ తరఫున 27 గోల్స్ బాదిన ఈ స్ట్రైకర్.. రెండు సార్లు గోల్డెన్ బూట్ ను సాధించాడు. అయితే ఈ సారి మాత్రం 16 గోల్స్‌తోనే సరిపెట్టుకున్నాడు. కానీ అతడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

అయితే గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఎర్లింగ్ హాలాండ్ మరో రెండేళ్లు మాత్రమే కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా ఈ కాంట్రాక్ట్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మాంచెస్టర్ సిటీ. మరో తొమ్మిదిన్నరేళ్ల పాటు హాలాండ్‌ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అంటే ఈ తాజా ఒప్పందం ప్రకారం ఎర్లిండ్ హాలాండ్.. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో 2034 వరకు కొనసాగనున్నాడు.
ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఈ కాంట్రాక్ట్ సుదీర్ఘ కాలం పాటు సాగే ఒప్పందని ఫుట్ బాల్ వర్గాలు తెలిపాయి. ఈ కాంట్రాక్ట్ ద్వారా హాలాండ్ వారానికి ఐదు లక్షల పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు ఐదున్నర కోట్లకు పైగా) అందుకోనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఈ లీగ్ హిస్టరీలోనే ఇంత పెద్ద మొత్తంలో అందుకుంటున్న తొలి ఆటగాడిగా హాలాండ్ నిలిచాడు.
తన కాంట్రాక్ట్ పొడిగించడంపై హాలాండ్ మాట్లాడుతూ ''నేను ఎంతో సంతోషంగా, గర్వంగా ఉన్నాను. మాంచెస్టర్ సిటీ క్లబ్‌తో సుదీర్ఘ కాలం పాటు కొనసాగేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇక ఆటపై నేను మరింత ఎక్కువ దృష్టి సాధించగలను. ఒకే జట్టుతో కలిసి ఎక్కువ కాలం ప్రయాణించడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయి.'' అని పేర్కొన్నాడు.