
ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ను ఎదుర్కొన్న ఆ జట్టు ఏకంగా 6-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగిన గోంకాలో రామోస్.. ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో అభిమానులు రొనాల్డోను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.
గ్రూప్ హెచ్‌లో రెండు విజయాలు సాధించిన పోర్చుగల్.. చివరి గ్రూప్ మ్యాచ్‌లో సౌత్ కొరియా చేతిలో ఓడింది. అయితే గ్రూప్ టాపర్‌గానే నాకౌట్స్ చేరింది. అదే సమయంలో స్విట్జర్లాండ్ జట్టు కూడా రెండు విజయాలు, ఒక ఓటమితో గ్రూప్ జిలో రెండో స్థానంలో నిలిచి నాకౌట్స్ చేరుకుంది. ఈ రెండు జట్లు బలంగానే కనిపించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు భావించారు. కానీ పోర్చుగల్ విజృంభించడంతో మ్యాచ్ ఆసాంతం ఏకపక్షంగానే సాగింది.
మ్యాచ్ తొలి హాఫ్ టైంలో బాల్ పొసెషన్ కోసం రెండు జట్లు గట్టిగానే ప్రయత్నించాయి. అయితే రొనాల్డో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గోంకాలో రామోస్ తొలి గోల్ చేసి పోర్చుగల్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత కాసేపటికే పోర్చుగల్ మరో గోల్ చేసి తొలి అర్ధభాగాన్ని 2-0 ఆధిక్యంలో ముగించింది. స్విట్జర్లాండ్ ఎంత ప్రయత్నించినా ఈ సమయంలో ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది.
సెకండ్ హాఫ్‌ను కూడా పోర్చుగల్ దూకుడుగానే ఆరంభించింది. ఆట మొదలైన ఆరో నిమిషంలోనే రామోస్ మరో గోల్ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత రామోస్ అందించిన అసిస్ట్‌ను రాఫెల్ గురారో చక్కని గోల్‌గా మలచడంతో పోర్చుగల్ 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇలాంటి సమయంలో స్విస్ ప్లేయర్ మాన్యూల్ అకాంజీ ఒక గోల్ చేసి స్విట్జర్లాండ్ అభిమానులకు కొంత ఊరటనిచ్చాడు. అయితే రామోస్ మరో గోల్ చేయడంతోపాటు చివర్లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రఫేల్ లియో కూడా గోల్ చేయడంతో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రామోస్ ఆటతీరు చూసిన ఫ్యాన్స్.. రొనాల్డోను తెగ ట్రోల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ క్వార్టర్స్ చేరడం 16 ఏళ్ల తర్వాత పోర్చుగల్‌కు ఇదే తొలిసారి.