కేప్ టౌన్: సాకర్ వరల్డ్ కప్ లో తొలి సంచలన విజయం నమోదైంది. పోర్చుగల్ 7-0తో ఉత్తర కొరియాను చిత్తుచేసింది. గ్రీన్ పాయింట్ స్టేడియంలో గోల్స్ వర్షం కురిసింది. తమ ప్రపంచకప్ చరిత్రలో పోర్చుగల్ అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసింది. తాజా భారీ విజయంతో పోర్చుగల్ దాదాపుగా నాకౌట్ దశకు చేరింది. సరిగ్గా 44 ఏళ్ల క్రితం(1966) ఉత్తర కొరియాను 5-3తో ఓడించిన ఈ యూరప్ జట్టు మరో 'గ్రేట్' విజయాన్ని సాధించింది. తాజా గోల్స్ విజృంభణకు అప్పటి హీరో యూసిబియొ ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు.
సోమవారం జరిగిన గ్రూప్-జి మ్యాచ్ లో మూడో ర్యాంక్ పోర్చుగల్ ముచ్చటగొలిపే ఆటతీరును కనబరిచింది. మేటి జట్టుతో అసలేమాత్రం పోటీకి రామని 105వ ర్యాంకు ఉత్తర కొరియా చెప్పకనేచెప్పింది. ప్రథమార్ధంలో ఓ మోస్తరుగా కదిలిన కొరియా సేన ద్వితీయార్ధంలో కుదేలైంది. 1-0తో రెండో అర్ధభాగాన్ని ప్రారంభించిన పోర్చుగల్ 'ఆరే'సింది. ఆట 29వ నిమిషంలో రాల్ మెర్ లెస్ తొలి గోల్ తో పోర్చుగల్ కు శుభారంభమిచ్చాడు.
ఇదే 1-0 ఆధిక్యంతో తొలి అర్ధభాగం ముగిసింది. ఇక రెండో సగంలో రొనాల్డో సేన పంజా విసిరింది. నిమిషాల వ్యవధిలో సిమావొ(53వ ని.), హుగొ అల్మెడా(56వ ని.)లు గోల్స్ చేయడంతో పోర్చుగల్ 3-0 ఆధిక్యంతో దూసుకెళ్లింది. వరుసగా ప్రత్యర్థులు కదంతొక్కడంతో చేసేదేమీ లేక కొరియన్లు చేష్టలుడిగారు. మరోవైపు దాడులకు పదును పెట్టిన పోర్చుగల్ సైన్యంలో టియాగొ రెండు గోల్స్ చేయడంలో సఫలమయ్యాడు. అతను 60వ, 89వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. లీడ్సన్ 81వ నిమిషంలో, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో 87వ నిమిషంలో గోల్ సాధించడంతో పోర్చుగల్ 7-0తో మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. ప్రస్తుత 19వ ప్రపంచకప్‌లో ఇదే అతిపెద్ద విజయం.