
హైదరాబాద్: ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో ఓడినా.. క్రొయేషియాకు అభిమానుల్లో ఏమాత్రం విలువ తగ్గలేదు. ఎందుకంటే ప్రత్యర్థి చేతుల్లో చిత్తుగా ఏం ఓడిపోలేదు. రెండు గోల్స్ సాధించి.. కేవలం ఆటగాడి తప్పిదం వల్ల సెల్ఫ్ గోల్ నమోదుకావడంతో రెండుతో సరిపెట్టుకుంది. అయినా ఆట ముగిసేంత వరకూ అదే పోరాటపటిమను కొనసాగించిన క్రొయేషియాకు ఆ దేశ అభిమానులు అపూర్వ రీతిలో స్వాగతం చెప్పారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద దాదాపు లక్ష మంది అభిమానులు గుమిగూడి తమ జట్టుకు స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ బస్సులో వచ్చిన క్రొయేషియా జట్టు.. అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగింది. గోల్డెన్ బాల్ విజేత, క్రొయేషియా కెప్టెన్ లుకా మోద్రిచ్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు.
ఈ క్రమంలో.. తమ జట్టును క్రొయేషియా మీడియా ఆకాశానికెత్తేసింది. ఆదివారంనాటి ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో 2-4తో పరాజయం చవిచూసిన తమ జట్టు ఆటగాళ్లను హీరోలుగా కొనియాడింది. 'హీరోలకు కృతజ్ఞతలు. మీరు మాకు అన్నీ ఇచ్చారు' అని ఓ పత్రిక మొదటి పేజీలో కీర్తించింది.
'మీరు మాకు గర్వకారణం. మీ పేర్లు దేశ చరిత్రలో చిరకాలం నిలుస్థాయి' అని పేర్కొంటూ గోల్డెన్ బాల్ అవార్డు కైవసం చేసుకున్న లుకా మోద్రిచ్ ఫొటోను ప్రచురించింది. 'వీరులారా! మేం గర్వపడేలా చేశారు' అని మరో పత్రిక ప్రశంసించింది. గత నెలరోజుల్లో జ్లాటో డాలిక్ (కోచ్) జట్టు క్రొయేషియాను ఎంతో ఉన్నత స్థానానికి తీసుకుపోయిందని వ్యాఖ్యానించింది. ఎరుపు-తెలుపు పెయింట్ వేసుకొన్న లక్ష మందికిపైగా క్రొయేషియా అభిమానులు సోమవారం స్వదేశానికి విచ్చేసిన తమ జట్టును ఘనంగా స్వాగతించారు.