
రియో డి జెనీరో: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి తమ ప్రభుత్వానికి సహాయం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బ‌్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ తనవంతు ఆర్థిక సాయం అందించాడు. కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన తన సొంతదేశం బ్రెజిల్‌ను ఆదుకునేందుకు ఒక మిలియన్ డాలర్లు (రూపాయలు 7 కోట్ల అరవై ఐదు లక్షలు)ను విరాళంగా ప్రకటించాడు.
మిలియన్ డాలర్లలో కొంత మొత్తాన్ని యునిసెఫ్‌కు అందించగా.. మిగతాది కరోనా బాధితుల సహాయ కార్యక్రమాలకు అందించనున్నట్లు నెయ్‌మార్ పేర్కొన్నాడు. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం కోసం అతడి కార్యాలయాన్ని సంప్రదించగా.. విరాళానికి సంబంధించిన వివరాలు, ఆర్థిక సాయం గురించి మేము ఎప్పుడు మాట్లాడం అని జవాబు ఇచ్చారు. రొనాల్డో, మెస్సీ తర్వాత ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యధిక సంపాదన కలిగి ఉంది నెయ్‌మారే.
నెయ్‌మార్ కరోనా వైరస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శల పాలయ్యాడు. ఒక బీచ్ వాలీబాల్ కోర్టులో చాలామంది సన్నిహితంగా కలసి గడుపుతున్న ఫోటో బయటకు రావడం చర్చనీయాంశమైంది. కరోనా వైరస్ వచ్చిన వేళ అందరూ సెల్ఫ్ ఐసొలేషన్‌కు సిద్ధమవుతున్నవేళ.. నెయ్‌మార్ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శలు ఆగ్రహం చేసారు. అయితే నెయ్‌మార్ క్వారంటైన్‌లో ఉన్నాడని అతని పీఆర్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు కరోనా పై పోరాటానికి తనవంతు సాయం చేసిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌ను.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ అభినందించాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఇప్పటికే మిలియన్ యూరోలు విరాళంగా ఇచ్చిన జొకో.. తాజాగా నాదల్ నిర్వహిస్తున్న ట్రస్టుకు ఆర్థిక సాయం అందించాడు. దీంతో తన సహచరుడికి ధన్యవాదాలు తెలిపాడు.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను అతలాకుతులం చేస్తున్న కొవిడ్-19 ముఖ్యంగా యూరప్ దేశాలను పట్టి పీడిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరించడంతో.. 11 లక్షల మందికి పైగా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటివరకు 50 వేల మందికి పైగా మరణించినట్లు సమాచారం తెలుస్తోంది.