గౌహతి: నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి టీం తమ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపు తేవాలని తలపోస్తోంది. వచ్చేనెల ఒకటో తేదీన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎనఎల్) మూడో ఎడిషన్ ప్రారంభోత్సవ వేడుకలను వేదికగా మార్చుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. జట్టు ప్రాంఛైసీ, ఆటగాళ్లు. అదే సమయంలో ఫుట్‌బాల్ క్రీడలో ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యాన్నీ ప్రపంచానికి వెలుగెత్తి చాటనున్నారు. హీరో ఐఎస్‌ఎల్ 2016 ప్రారంభ వేడుకలు గౌహతిలో జరుగడం తమకు గర్వకారణమని ఈశాన్య రాష్ట్రాల ఫుట్‌బాల్ క్రీడాకారులు చెప్తున్నారు.
ఐఎస్‌ఎల్ 3 సీజన్ ప్రారంభోత్సవంతోపాటు కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్‌సితో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టు ప్రారంభ మ్యాచ్ జరుగనున్నది. భారత్ ఏస్ స్ట్రైకర్ జెజె లాల్పెఖులౌ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2011లో తొలిసారి ఇదే ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి ఇంకా గుర్తు ఉందన్నాడు. మౌలిక వసతుల పరంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరిగిందని, ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నాడు.
చెన్నైయిన్ ఎఫ్‌సి తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్ బిడ్డ థోయిసింగ్ మాట్లాడుతూ ఈ దఫా ఐఎస్‌ఎల్ తొలి మ్యాచ్‌ను గౌహతిలో నిర్వహించాలని నిర్ణయించడం తమకు గర్వకారణమన్నాడు. 'నేను ఆటను ప్రేమిస్తా. నా అడుగులు ముందుకే పడతాయి. గౌహతిలో ఆటకు అనుకూలమైన వాతావరణం తమకు స్ఫూర్తిని కలుగజేస్తుందన్నాడు.

ఐఎస్‌ఎల్ 3 సీజన్ ప్రారంభోత్సవం కోసం ఇక నార్త్ ఈస్ట్ యునైటెడ్ (ఎన్‌ఇయు) ఎఫ్‌సి ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గౌహతి వేదికగా ఐఎస్‌ఎల్ మూడో ఎడిషన్ ప్రారంభ వేడుకలు జరుగనుండటం ఈశాన్య రాష్ట్రాల్లో ఫుట్‌బాల్, ఇతర క్రీడల పట్ల ఆసక్తిని కలిగిస్తుందని, మరింత మంది యువతను ఆకర్షిస్తుందన్నాడు. ఈ టోర్నీ ద్వారా క్రీడాకారులు మరింత నైపుణ్యవంతులుగా అభివృద్ధి చెందుతారన్నాడు.
నార్త్ ఈస్ట్ టీమ్ ప్రతినిధి సైయాసీన్ సింగ్ మాట్లాడుతూ తమకు బోలెడంత మంది ఫ్యాన్స్ గల గౌహతిలో టోర్నీ ప్రారంభ వేడుకలు జరుగనుండటం తనకు గర్వకారణంగానూ, సంతోషంగానూ ఉన్నదని తెలిపాడు. ఈ వేడుకల నిర్వహణతో ఈశాన్య రాష్ట్రాలన్నీ ఫుట్‌బాల్ ఆటపై దృష్టి సారిస్తాయన్నాడు. మూడేళ్ల క్రితం ఐఎస్‌ఎల్ లీగ్‌ను ప్రారంభించినప్పుడూ దేశమంతా ఆ టోర్నీ నిర్వహణపైనే దృష్టి సారించిందని గుర్తుచేశాడు. కనుక ఈ టోర్నీ ప్రారంభంతో ప్రతి ఒక్కరూ ఈశాన్య భారతావనిపై తప్పనిసరిగా దృష్టి సారించాలన్న సందేశం దేశమంతటికీ వెళుతుందని చెప్పాడు.
నార్త్ ఈస్ట్ మిడ్ ఫీల్డర్ లాల్రేంపుయా మాట్లాడుతూ 'క్రీడాకారుడికి జీవితకాలంలో ఒకే ఒక్కసారి అవకాశం లభిస్తుంది. క్రీడల ప్రారంభం కోసం తాను, గౌహతిలోని తన మిత్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపాడు. 'ఈ క్రీడల ప్రారంభోత్సవాన్ని యువత వీక్షించడంతోపాటు స్ఫూర్తి పొందుతారని, భవిష్యత్‌లో ఫుట్‌బాల్ ఆడేందుకు ఆసక్తి చూపుతారని మా జట్టు యజమాని జాన్ అబ్రహం నాతో అన్నారు' అని చెప్పాడు.
శనివారం గౌహతిలో జరిగే ఐఎస్‌ఎల్ మూడో ఎడిషన్ ప్రారంభోత్సవానికి ఎనిమిది ఫ్రాంచైసీల క్రీడాకారులు, యజమానులు, ప్రముఖులు, ఫుట్‌బాల్ సంఘాల ప్రతినిధులు రానుండంతో ఈ ప్రాంతానికి కొత్త శోభ రానున్నదనడంలో సందేహం లేదు.