జొహానెస్ బర్గ్: ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్ తన సత్తా చాటుకుంది. సోమవారం తన తొలి మ్యాచ్ (గ్రూప్-ఇ)లో 2-0తో డెన్మార్క్‌ను ఓడించింది. డెన్మార్క్ డిఫెండర్ డానియల్ అగెర్ సెల్ఫ్‌గోల్ (46వ నిమిషం)తో తొలి గోల్ సాధించిన నెదర్లాండ్స్‌కు ఆఖరి నిమిషాల్లో డిర్క్ క్యుట్ రెండో గోల్ అందించాడు. సాకర్‌సిటీ స్టేడియంలో తొలి అర్ధభాగంలో నెదర్లాండ్స్ కాస్త ఆధిపత్యాన్ని ప్రదర్శించినా డెన్మార్క్ కూడా పోరాడింది. ఐతే రెండు జట్లు కూడా వేగంతో ఆడలేదు. పెద్దగా అవకాశాలు సృష్టించుకోలేదు.
స్టార్ మిడ్‌ఫీల్డర్ అర్జెన్ రాబెన్ గాయంతో దూరం కావడంతో డెన్మార్క్ డిఫెన్స్‌ను ఛేదించడానికి నెదర్లాండ్స్ చెమటోడ్చింది. రఫెల్ వాండెర్‌వాత్, వెస్లే స్నెడర్, పెర్సీ ఆరంభంలో గోల్స్ చేసేలా కనిపించారు. కానీ డెన్మార్క్ డిఫెన్స్ అడ్డుకుంది. తొలి సగంలో గోల్సేమీ రాలేదు. రెండో అర్ధ ఆరంభంలోనే డెన్మార్క్‌కు షాక్. డానియల్ నెగర్ సెల్ఫ్‌గోల్ఫ్ చేసి డెన్మార్క్‌ను దెబ్బతీశాడు. పెర్సీ (నెదర్లాండ్స్) ఎడమవైపు నుంచి ఇచ్చిన క్రాస్ పెద్దగా ప్రమాదకరంగా కనపడలేదు.
కానీ పౌల్సన్ బంతిని తలతో దూరంగా నెట్టే ప్రయత్నం చేయగా అది డానియల్ అగెర్ ను తగిలి ఘనా నెట్లోకి వెళ్లింది. ఆ తర్వాత డెన్మార్క్ సమం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ నెదర్లాండ్స్ పట్టును కొనసాగించింది. సబ్ స్టిట్యూట్ ఎలియా రాకతో ఆ జట్టు వేగం పెరిగింది. డెన్మార్క్ డిఫెన్స్ ఒత్తిడికి లోనైంది. ఫలితమే 85వ నిమిషంలో గోల్. లియా షాట్ పోల్ కు తగిలి వెనక్కి వచ్చింది. క్యుట్ వెంటనే దాన్ని నెట్లోకి నెట్టాడు.