కోల్‌కతా: తమ అభిమానులతోపాటు సాధారణ ప్రజల్లోకి జట్టు గురించి ప్రచారంచేసేందుకు ఐఎస్‌ఎల్ ఫ్రాంచైసీ అట్లెంటికో డీ కోల్‌కతా (ఎటికె) జట్టు కొత్త గేయం, కొత్త నినాదాన్ని ఆవిష్కరించింది. 'అమర్ బర్కీ ఎటికె (ఎటికే నా హృదయం) అనే పేరుతో గేయాన్ని ఆవిష్కరించారు. జట్టు సారధి హెల్డర్ పోస్టిగ, ఫార్వర్డ్ ఐయాన్‌హుమ్, యజమానులు సంజయ్ గోయెంకా, సౌరవ్‌గంగూలీ, ఉత్సవ్ పరేఖ్, హర్షవర్ధన్ నియోటియా, అట్లెంటికో మాడ్రిడ్, డిఫెండర్ అర్నాబ్ మొండాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐఎస్‌ఎల్ తొలి సీజన్ చాంపియన్‌గా, గత ఏడాది సెమీ ఫైనలిస్ట్‌కు చేరిన జట్టుగా అట్లెంటికో డీ కోల్‌కతా జట్టును తమ అభిమానులకు మరింత దగ్గర చేసేందుకే ఈ గీతాన్ని ఆవిష్కరించింది. కోల్‌కతా నగరంలో ఫుట్‌బాల్ అసోసియేషన్లు ఉన్నాయి. కానీ ఈస్ట్ బెంగాల్, మొహున్ బగాన్‌లకు ఆ అసోసియేషన్లు మద్దతునిస్తుండటంతో మూడో దశ ఐఎస్‌ఎల్‌లో అభిమానులతో మరింత అనుసంధానమయ్యేందుకు ఎటికె జట్టు యాజమాన్యం ఈ ప్రచార వ్యూహం రూపొందించింది.
ఐఎస్‌ఎల్‌తో భారత్‌కు మేలు: అర్నాబ్ మొండాల్
ఈ సందర్భంగా అర్నాబ్ మొండాల్ మాట్లాడుతూ ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) విలువైన సహాయ, సహకారాలు అందజేస్తున్నదని వ్యాఖ్యానించాడు. తద్వారా ఐఎస్‌ఎల్‌తో భారతీయ క్రీడాకారులకు లబ్ధి, ప్రయోజనం చేకూరుతున్నదన్న భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్ స్టీఫెన్ కాంస్టాంటైన్ వ్యాఖ్యతో ఏకీభవించాడు.

'రెండున్నర నెలల పాటు జరిగే ఈ టోర్నీలో డ్రెసింగ్ రూమ్‌లో విదేశీ క్రీడాకారుల నుంచి భారతీయులు ఎంతో నేర్చుకుంటున్నారు. వారు అంతర్జాతీయంగా మెరుగైన వసతులు గల ప్రాంతాల్లో శిక్షణ పొందగలుగుతున్నారు.' అని తెలిపాడు.
'ఐఎస్‌ఎల్‌కు ముందు అంతర్జాతీయ అవకాశాలు పొందడానికి మేం కష్టపడాల్సి వచ్చేది. కానీ ఐఎస్‌ఎల్ జట్లకు అగ్రశ్రేణి విదేశీ కోచ్‌లు, సహాయ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. తత్ఫలితంగా భారత క్రీడాకారులు ఆత్మవిశ్వాసం, ఫిట్‌నెస్ పొందగలుగుతున్నారు' అని చెప్పాడు. కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ ప్రీమియర్ డివిజన్‌లో భాగసమైన ఈస్ట్ బెంగాల్ జట్టులో భాగస్వామి కావడంతో అర్నాడ్ మెండాల్.. విదేశాల్లో అట్లెంటికో జట్టు ప్రీ సీజన్ శిక్షణ అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే తాను మానసికంగా, భౌతికంగా ఐఎస్‌ఎల్‌లో మెరుగైన ఆటతీరు ప్రదర్శనకు సంసిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.
తిరిగి జట్టు సారధిగా ఎంపికైన హెల్డర్ పొస్టిగ పూర్తిగా గాయాల నుంచి కోలుకుని మూడో ఐఎస్‌ఎల్‌కు సంసిద్ధంగా ఉన్నాడు. పోర్చుగీస్ లెజెండ్ అయిన పోస్టిగ గాయాల వల్ల గత సీజన్‌లో పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. పొస్టిగకు మద్దతుగా కెనడాకు చెందిన ఇయాన్ హుమ్ ప్రత్యర్థులపై అటాకింగ్ పాత్ర పోషించనున్నాడు. గత ఏడాది మాదిరిగానే తమ జట్టు మంచి ఫామ్‌లో ఉందని, ఈ దఫా టైటిల్ తమ జట్టుదేనని ధీమా వ్యక్తంచేశాడు.
కోల్‌కతా మ్యాచ్‌లకు నో ప్రాబ్లం: సంజయ్‌గోయల్
మూడో సీజన్ ఐఎస్‌ఎల్‌లో అట్లెంటికో డీ కోల్‌కతా (ఎటికె)కు సొంత నగరంలో మ్యాచ్‌లు ఆడేందుకు ఎటువంటి సమస్య లేదని జట్టు ఫ్రాంచైసీ సహ యజమాని సంజయ్‌గోయల్ పేర్కొన్నాడు. గత రెండు సీజన్లలో స్టాల్‌లేక్ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడిన ఎటికె.. ఈ దఫా రవీంద్ర సారోబార్ స్టేడియంలో ఆడనున్నది. వచ్చే ఏడాది జరుగనున్న అండర్ | 17 ప్రపంచ కప్ కోసం స్టాల్‌లేక్ స్టేడియానికి మరమ్మతు, ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.
కానీ కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ వేత్తలు రాత్రి ఏడు గంటల తర్వాత మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల రవీంద్ర సారోబార్ స్టేడియానికి పర్యావరణ పరంగా సమస్యలు ఎదురవుతాయని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. ఐదుగురు సభ్యుల కమిటీ ఈ స్టేడియంను సందర్శించి పర్యావరణానికి ముప్పు వాటిల్లే అంశాలను మదింపుచేస్తుంది. తదుపరి ఈ నెల 27వ తేదీన జరిగే విచారణలో స్టాల్ లేక్ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్ణయంపై ట్రిబ్యునల్ తన ఆదేశాలను జారీచేసే అవకాశం ఉంది.
అయితే గ్రీన్ ట్రిబ్యునల్ జారీచేసే ఆదేశాలను తాము తు.చ. తప్పకుండా పాటిస్తామని, ఎటువంటి సమస్య రాబోదని సంజయ్ గోయల్ అన్నాడు. ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఏం నిర్ణయం జరుగుతుందో వేచి చూద్దామన్నాడు.