
షూటౌట్లో పాల్గొనేందుకు సిద్ధం
‘షూటౌట్లలో తాము పాల్గొంటామని ఇయాన్ హుమ్, జువెల్ రాజా నా వద్దకు వచ్చి చెప్పారు. ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. పరిస్థితులకు అనుగుణంగా ప్లేయర్ల మనోభావాలకు విలువనివ్వాలి. కానీ ఈ రోజు ప్లేయర్లంతా షూటౌట్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరకు పెనాల్టీతో చాంపియన్ షిప్ గెలుచుకోవడంతో నా కోచింగ్ స్టాఫ్ తో కలిసి సంబురాలుచేసుకున్న తర్వాత నేను నా కుటుంబం కోసం స్వదేశాని (స్పెయిన్) కి బయలుదేరతాను' అని మొలీనా తెలిపాడు.

భారతీయ ప్లేయర్లు తమ వంతు పాత్ర
టోర్నీలో భారతీయ ప్లేయర్లు తమ వంతు పాత్ర పోషించారన్నాడు. వారంతా ఆడేందుకు, అవసరమైన అంశాలు నేర్చుకుని మెరుగు పర్చుకునేందుకు సిద్ధంగా ఉండటమే తనను మెప్పించిందన్నాడు. ప్రొఫెషనల్ ప్లేయర్ల నుంచి క్వాలిటీ ఆట కోరుకోవచ్చునన్నాడు. గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ టైటిల్ పోరులో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. సెడ్రిక్ హెంగ్బార్ట్ చేసిన షూటౌట్ ను తోసిపుచ్చడం ద్వారా దేబ్జిత్ జట్టును ఆదుకోవడం సాధారణం కాదన్నాడు. ఆయన సైతం మెరుగు పడాలని కోరుకుంటున్నాడని చెప్పాడు. అయితే ఐఎస్ఎల్ లీగ్ దీర్ఘ కాలం పాటు సాగితేనే భారతీయ ఫుట్ బాల్ కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నాడు.

కేరళ ఫ్యాన్స్‌కు కొప్పెల్ క్షమాపణ
టైటిల్ కోసం జరిగిన పోరులో అట్లెటికో డి కోల్ కతా చేతిలో 4 - 3 తేడాతో ఓటమి పాల్వడం పట్ల కేరళ బ్లాక్ బస్టర్స్ చీఫ్ కోచ్ స్టీవ్ కొప్పెల్ తన జట్టు అభిమానులకు క్షమాపణ చెప్పాడు. ‘మేం ఏమీ కోల్పోలేదు. మేం మ్యాచ్ డ్రాగా ముగించాం. పెనాల్టీలతోనే లీగ్ కోల్పోయాం. టైటిల్ గెలుచుకున్నందుకు అట్లెటికో డి కోల్ కతా జట్టును అభినందిస్తున్నా. మా కుర్రాళ్లు నాలుగు రోజుల గడువులోగా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం వల్ల కూడా అలసిపోయారు. సెమీ ఫైనల్స్ లో తొలుత కోచిలో, తర్వాత ఢిల్లీలో మ్యాచ్ లు ఆడాం. ఆ వెంటనే కోచిలో టైటిల్ పోరు కోసం సిద్ధమయ్యాం. కానీ లోపాలు వెతకడం లేదు. టైటిల్ గెలుచుకునే అర్హత కోల్ కతాదే' అని కొప్పెల్ తేల్చి చెప్పాడు.

తమ కుర్రాళ్లు అద్భుతమైన ఆట ఆడారు
ఢిల్లీ నుంచి వెంటనే రావడానికి విమానాలు అందుబాటులో లేక ఒకరోజంతా అక్కడే గడపాల్సి రావడం కూడా తమకు ఇబ్బందికరంగా మారిందన్నాడు. తమ కుర్రాళ్లు అద్భుతమైన ఆట ఆడారన్నాడు. ట్రోఫీ గెలుచుకోలేకపోయినందుకు అందరి తరఫున అభిమానులకు క్షమాపణ చెప్తున్నానన్నాడు. ఇది గొప్ప అనుభవం అని కూడా పేర్కొన్నాడు. జట్టు సారధి హుగెస్ గాయంతో వైదొలడం కూడా విజయావకాశాలను దెబ్బ తీసిందన్నాడు.

ఆ తర్వాత తుది నిర్ణయం
ప్రారంభం నుంచి హుగెస్ పోరాటం జరిపినా ప్రయోజనం లేకపోయిందని చెప్పాడు. ఎల్లోకార్డు సస్పెన్షన్‌తో జోస్ కురియస్ టైటిల్ పోరుకు దూరం కావడం ఇబ్బందికరంగా మారిందన్నాడు. తదుపరి సీజన్‌లో తాను కోచ్ గా ఉంటానా? లేదా? చెప్పడానికి ఇది సరైన సమయం కాదన్నాడు. తొలుత తన తల్లి ఆరోగ్యాన్ని చూసుకోవాల్సి ఉందని, అటు పిమ్మట ఫ్రాంచైసీ యాజమాన్యంతో సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నాడు.


Click it and Unblock the Notifications













