చెన్నై: తొలి మ్యాచ్‌లోనే తప్పటడుగు వేసిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్ సి జట్టు పూర్వ వైభవం కోసం అష్టకష్టాలు పడుతున్నది. ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో అట్లెటికో డీ కోల్‌కతాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో డ్రాతో సరిపెట్టుకున్న మాట్టరాజీ సేన.. మరో మ్యాచ్‌లో ఓటమి పాలై.. చివరి మూడు మ్యాచ్‌లతో కలిపి మొత్తం ఎనిమిది పాయింట్లతో కోలుకున్నా.. ప్లేఆఫ్ దశకు వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నది.
నార్త్ఈస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి టాప్ 4లో చోటు దక్కించుకున్నా.. పుణెతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్లేఆఫ్ దిశగా జట్టు ప్రయాణం నెమ్మదించింది. తద్వారా ఫ్లేఆఫ్ ఆశలు సజావుగా నిలుపుకునే సువర్ణావకాశాన్నికోల్పోయింది. ఈ నేపథ్యంలో శనివారం చెన్నైలో కేరళ బ్లాక్ బస్టర్స్‌తో తలపడనున్నది.
ఈ తరుణంలో జట్టు సభ్యులు మంచి ఆటతీరు ప్రదర్శించాలని హెడ్ కోచ్ మార్కో మాట్టరాజీ అభ్యర్థిస్తున్నాడు. నాలుగు రోజుల్లో కేరళ బ్లాక్ బస్టర్స్, తర్వాత ముంబై సిటీ జట్లతో మ్యాచ్‌ల్లో గెలువాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తెరిగి వ్యవహరించాలని సభ్యులకు సూచించాడు. ప్లే ఆఫ్ దశకు చేరుకోవాలంటే శనివారం కేరళ, తర్వాత ముంబై సిటీతో జరిగే మ్యాచ్ లలో చెన్నైయిన్ తప్పనిసరిగా గెలుపొందాల్సిన అవసరం ఉంది.
ఆయన మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ 'ఈ రెండు మ్యాచ్‌లు మాకు మూలాధారమైనవి. ఒక మ్యాచ్‌లో విజయం సాధించడమే కష్టం. కానీ మేం రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాలంటే చాలా కష్టం. అయితే మేం గత రెండు వారాలుగా మంచి శిక్షణ పొందాం. మంచి అటాకింగ్ చేయగల సామర్థ్యం గల టీంతో మేం ఆడబోతున్నాం మాకు తెలుసు.
ఒకవేళ పుణెతో జరిగిన మ్యాచ్‌లో దూకుడు మనస్తత్వంతో ఆడి గెలుపొందితే మేం టాప్ లోకి వెళ్లేవాళ్లం. ఈ దశలో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఒకవేళ మీరు ఓటమి పాలైతే నాటౌట్ అయినట్లు కాదు. ఎఫ్ సి గోవా జట్టు కొన్ని మ్యాచ్‌ల్లో ఓటమి పాలై ఉండొచ్చు. కానీ వారిది చాలా మంచి టీం. వారు తిరిగి కోలుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారు.

దిగువన ఉన్న ఏ జట్టైనా తిరిగి దూసుకెళ్లగలదు. మేం ఇటువంటి అంశాలనే పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకశిక్షణ పొందాం. సాధ్యమైనంత మేరకు మిగతా మ్యాచ్‌లలో గెలుపొందేందుకు ప్రయత్నిస్తాం' అని తెలిపాడు. పుణె సిటీతో జరిగిన మ్యాచ్‌లో 1 - 1 స్కోర్‌తో డ్రాగా ముగించడంలో తమ కుర్రాళ్ల పెర్పార్మెన్స్‌పై తాను సంతోషంగానే ఉన్నానన్నారు.
ఫ్రీ కిక్ గోల్ తమకు అనుకూలంగా ఉన్నా సద్వినియోగంచేసుకోలేకపోవడం వల్లే రెండు పాయింట్లు తగ్గిపోయాయని తమ కుర్రాళ్లు అప్‌సెట్ అయ్యారని తెలిపాడు. తాము స్మార్ట్‌గా ఉంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగిన గత ఆరు మ్యాచ్‌ల్లో చెన్నైయిన్ నాలుగింట్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ ఓటమి పాలు కాగా, మరో మ్యాచ్ లో కేరళ బ్లాక్ బస్టర్స్ విజయం సాధించింది.
కానీ గత గణాంకాలేవీ పనిచేయవని మాట్టరాజీ స్పష్టంచేశాడు. ఆ గణాంకాలపై ఆధారపడి ముందుకు వెళ్లలేమని పేర్కొన్నాడు. ఢిల్లీ డైనమోస్ తో జరిగిన మ్యాచ్‌లో తాము ఓటమి పాలవ్వడం తనను డిజప్పాయింట్ చేసిందన్నారు. ఐఎస్ఎల్ కెరీర్‌లోనే అది అత్యంత దారుణమైన మ్యాచ్ అని వ్యాఖ్యానించాడు. తమ కుర్రాళ్లు పరిణతి సాధించారని, ఆటతీరు మార్చుకునేందుకు సిద్ధమయ్యారని, పిచ్ పై తమ సత్తా రుజువు చేసుకుంటామని వారు తెలిపారన్నాడు.
కేరళ జట్టును ఎదుర్కొనేందుకు ఎలీ సాబియా మంచి డిఫెన్స్ రూపొందించాడని.. సూపర్ మాచన్స్‌ను ఎదుర్కొనేందుకు పాలసీ రూపొందిచుకున్నారని మాట్టరాజీ పేర్కొన్నాడు. మంచి పరిణతితో కూడిన వ్యూహాన్నిఎలీ రూపొందించాడని, కేరళ సారధి జాన్ ఆర్న్ రైస్, బెర్నాండ్ మెండీలను ఎదుర్కొనేందుకు ప్రాథమికమైన వ్యూహం సిద్ధమైందన్నారు.
పిచ్ పై ప్రొఫెషనల్‌గా వాస్తవిక ద్రుక్పథంతో వ్యవహరించాలని సూచించాడు. ఈ ఢిపెన్స్ వ్యూహం రూపొందించినందుకు ఎడర్ మాంటైరో, ఎలీ సాబియాలను తప్పనిసరిగా ప్రశంసించాలన్నాడు. అయితే ఎవరైనా తమకు గల సామర్థ్యం మేరకే ఆడగలరన్నాడు. బెర్నాండ్ మెండీ గత సీజన్ లో పెద్దగా ఆడిన దాఖలాలు లేవని, కానీ ఈ ఏడాది చాలా బాగా ఆడుతున్నాడని మాట్టరాజీ చెప్పాడు.
కేరళ కోచ్ స్టీవ్ కొప్పెల్ మాత్రం తొలి ఐఎస్ఎల్ సెషన్‌లో తమ ప్రత్యర్థి జట్టు చరిత్ర అసాంతం తమకు తెలుసునన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ తో జరిగే మ్యాచ్ గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదని కొట్టి పారేశాడు. కాకపోతే తాను మరో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, విభిన్న సన్నివేశం అని పేర్కొన్నాడు. గతంతో పోలిస్తే ఇప్పుడంతా పూర్తిగా భిన్నమని తెలిపాడు.
వారితో కొన్ని వారాల పాటు ఆడితే బెస్ట్ టీం బయటకు వస్తుందన్నాడు. తొలి ఏడాది కేరళ బ్లాక్ బాస్టర్స్, చెన్నైయిన్ మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. నాకౌట్ దశలో చెన్నయిన్‌ను కొట్టి పారేసి.. కేరళ బ్లాక్ బస్టర్స్ సెమీ ఫైనల్స్‌లో ప్రవేశించింది. ప్రస్తుతం టోర్నీ మధ్యలోకి చేరామని తెలిపాడు.
గోవాపై తమ జట్టు విజయం మానసికంగా బలం చేకూర్చిందని అదే తమకు ముఖ్యమని అన్నాడు. దిగువ నుంచి టాప్ కెళ్లే విషయమై గొప్ప విశేషాలేమీ ఉండవని వ్యాఖ్యానించాడు.