న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక అభిమానులు ఉన్నారంటే అది పిఫా వరల్డ్ కప్‌కే. అలాంటి పిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో గోల్ చేసిన బూట్ వేలం పాటలో ఏకంగా రూ. 19.41 కోట్లు పలికింది. ఇంతకీ ఆ బూట్ ఎవరిదని అనుకుంటున్నారా.. జర్మనీకి చెందిన సాకర్ ప్లేయర్ మారియో గోట్జెది.
ఈ ఏడాది బ్రెజిల్‌లో జరిగిన పిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో జర్మనీ 1-0తో అర్జెంటీనాను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. టైటిల్ సమరంలో ఏకైక గోల్ చేసింది గోట్జెనే కావడం విశేషం. తనకందిన పాస్‌ను ఎడమకాలితో గోల్‌గా మలిచాడు. ఆ ఎడమకాలి బూటే ఇప్పుడు వేలంలో రూ. 19.41 కోట్లు పలికింది.
24 ఏళ్ల తర్వాత జర్మనీ ప్రపంచవిజేతగా అవతరించేందుకు అవసరమైన గోల్‌ను ఈ బూటుతో సాధించింది. పిల్లల కోసం పనిచేసే ఓ జర్మన్ ఛారిటీ సంస్థ 'ఏ హర్ట్ ఫర్ చిల్డ్రన్' నిధుల నిధుల సేకరణ కోసం ఈ బూటును వేలం వేసింది. ఇంత ధర పలకడం చూసి ఛారిటీ ప్రముఖులే ఆశ్చర్యపోయారు.
గోట్జె మాట్లాడుతూ.. 'ఫైనల్ మ్యాచ్ అయిపోయాక ఆ బూటును ఎప్పుడూ ధరించలేదు. వాష్ కూడా చేయలేదు. ఆ రోజు స్టేడియం వదిలినపుడు బూటు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. బూటుపై కాస్త పచ్చిక కూడా ఉంది. ఇంట్లో దాన్ని భద్రంగా దాచాను. ఓ మంచి పని కోసం వేలం వేయడం సంతోషంగా ఉంది' అని చెప్పాడు.