జొహన్నెస్ బర్గ్: అందరి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ మారడోనా శిక్షణలో రాటుదేలిన అర్జెంటీనా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. అతికష్టమ్మీద ప్రపంచకప్‌కు అర్హత సాధించారని విమర్శించిన వారికి తగిన సమాధానమిచ్చింది. మొరటుగా ఆడతారనే పేరున్న నైజీరియాతో శనివారం జరిగిన గ్రూప్ 'బి' లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో విజయం సాధించింది. ఆట ఆరో నిమిషంలో సెబాస్టియన్ వెరోన్ సంధించిన కార్నర్‌ను పెనాల్టీ ఏరియా పైభాగంవద్ద ఉన్న గాబ్రియెల్ హెయింజ్ డైవ్ చేస్తూ హెడర్ ద్వారా అద్భుతరీతిలో బంతిని గోల్‌పోస్ట్ లోనికి పంపించాడు.
అంతే అర్జెంటీనా శిబిరంలో ఆనందోత్సాహాలు. కోచ్ మారడోనా అయితే తన భావోద్వేగాన్ని దాచుకోలేకపోయాడు. ఉద్వేగంతో ఊగిపోయాడు. మ్యాచ్ మొత్తంలో అర్జెంటీనా చేసింది ఒక్క గోలే అయినా ఆద్యంతం ఆధిపత్యం కనబర్చింది. ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారుడిగా నీరాజనాలు అందుకుంటున్న లియోనెల్ మెస్సీ తొలి మ్యాచ్‌లోనే తన పూర్తిస్థాయి ప్రావీణ్యాన్ని కనబర్చాడు. నైజీరియా గోల్‌కీపర్ విన్సెంట్ ఎనియెమా అప్రమత్తత కారణంగా మెస్సీ తొలి గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.