న్యూఢిల్లీ: డిఫెండింగ్ ఛాంపియన్లు సూపర్ మాచన్లు తేలిపోయారు. ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్ల చేతిలో ఈ సీజన్‌లో రెండో దఫా చెన్నై కుర్రాళ్లు బేలతనం ప్రదర్శించారు. దీనికి తోడు ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా చేసిన రెండు మ్యాజిక్ గోల్స్ తో చెన్నైయిన్ పై 4 - 1 స్కోర్ తేడాతో జట్టును విజయ తీరాలకు నడిపించాడు. మాలౌదాతోపాటు రిచర్డ్ గాడ్జె, కియాన్ లూయిస్ తలా ఒక స్కోర్ సాధించడంతో ఇది సాద్యమైంది. అంతేకాదు టాప్ 4 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఢిల్లీ డైనమోస్. ఇక చెన్నైయిన్ ప్లేయర్ బెర్నాండ్ మెండీ ఒక గోల్ చేసినా.. ఢిల్లీ డిఫెన్స్, అటాకింగ్ ముందు సూపర్ మచాన్స్ నిలువలేకపోయారు.
ఇరు జట్లు కూడా బంతిపై ఆధిపత్యం కోసం తొలి నుంచి ప్రయత్నించాడు. చెన్నైయిన్ ప్లేయర్ రాఫెల్ అగస్టో తొలుత ఫోర్స్ గా పంపిన బంతిని ఢిల్లీ గోల్ కీపర్ అంటోనియో డొబ్లాస్ సేవ్ చేశాడు. ఢిల్లీ మిడ్ ఫీల్డ్ ఆధిపత్యం సాధిస్తూ ముందుకు సాగింది. 15వ నిమిషంలో రిచర్డ్ గాడ్జె బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించేందుకు రెండు జట్ల మధ్య నెలకొన్నడెడ్‌లాక్‌కు తెర దించేందుకు యత్నించాడు. ఆ వెంటనే సారధి దూరం నుంచి కొట్టిన షాట్ బంతిని కరంజిత్ సింగ్ ద్వారా అందుకున్న గాడ్జె విజయవంతంగా బంతిని గోల్ పోస్ట్‌కు చేర్చాడు.
ఈ దఫా ఢిల్లీ త్రయం లూయిస్, మాలౌడా, గాడ్జె ఎడమ వైపు నుంచి చెలరేగిపోయారు. 25వ నిమిషంలో లెఫ్ట్ ఫుట్ ద్వారా ఫ్లోరెంట్ మాలౌదా బాటం కార్నర్‌లోకి బంతిని పంపడంతో గోల్ పోస్ట్ చేరింది. మాలౌదా తొలి గోల్ చేసేందుకు రిచర్డ్ గాడ్జె అనుకూల వాతావరణం నెలకొల్పాడు. దీంతో ఢిల్లీ ఖాతాలో రెండో గోల్ నమోదైంది. తద్వారా చెన్నైయిన్ జట్టుపై ఒత్తిడి పెరిగింది.

ఢిల్లీ దూసుకుపోతున్న నేపథ్యంలో చెన్నై కుర్రాడు బెర్నాండ్ మెండీ 37వ నిమిషంలో చేసిన ప్రయత్నం ఫలించింది. శరవేగంగా దూసుకెళ్తున్న మాలౌదా త్రయాన్ని ఎదుర్కొని బెండీ గోల్ చేయడంతో స్కోర్ ఆధిక్యం 2 - 1 కు తగ్గింది. ఇక మ్యాచ్ ఫస్టాఫ్ ముగిసే దశలో ఇరు జట్లలోనూ వేడి పెరిగింది. కొన్నిసార్లు చెన్నైయిన్ దూకుడుగా గోల్ చేసేందుకు ప్రయత్నించినా.. ఢిల్లీ డిఫెన్స్ నిలువరించి.. తమ ఆధిక్యాన్ని యథాతథంగా కొనసాగించింది.
ఈ దశలో చెన్నైయిన్ హెడ్ కోచ్ మార్కో మాట్టరాజీ గోల్ పాయింట్ కోసం ఇండియన్ స్ట్రయికర్ జెజె లాల్పేఖౌలాను సెకండాఫ్ లో బరిలోకి దించినా నిష్ప్రయోజనమైంది. 54వ నిమిషంలో కియాన్ లూయిస్ గోల్ చేయకముందు మాలౌదా స్పీడ్ తో కరంజిత్ దూకుడుగా ముందుకు సాగాడు. మాలౌదా పాస్ చేసిన బంతిని లూయిస్ 54వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు మరింత ఆధిక్యం చూపాడు. అప్పటికే స్కోర్ 3 - 1 ఆధిక్యానికి చేరుకున్నది. ఇక మ్యాచ్ ముగిసే వరకు చెన్నై సంచలనం జెజెతోపాటు హన్స్ ముల్లర్ పలుదఫాలు గోల్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
మరోవైపు మ్యాచ్ ముగియడానికి ఐదు నిమిషాల ముందు ఢిల్లీ సంచలనం మార్సిలిన్హో.. సూపర్ మాచన్లకు పెద్ద సవాల్ విసిరాడు. కానీ ఆయన కొట్టిన బంతి టార్గెట్ చేరలేదు. ఈ దశలో కార్నర్ నుంచి మార్సిలిన్హో పంపిన బంతిని మాలౌదా గోల్ పోస్ట్ దారి మళ్లించి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ పై రెండో విజయంతో సరిపెట్టుకోవద్దని ఢిల్లీ హెడ్ కోచ్ జంబ్రొట్టా తన కుర్రాళ్లకు హితబోధ చేశాడు. కాగా ఢిల్లీ డైనమోస్ జట్టుకిది వరుసగా నాలుగో విజయం కావడం గమనార్హం.
మ్యాచ్ ముగిసిన తర్వాత జంబ్రొట్టా మీడియాతో మాట్లాడుతూ తమ లక్ష్యం సెమీ ఫైనల్స్ కు చేరుకోవడమేనన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ చాలా మంచి టీం అని, కానీ దాన్ని ఎదుర్కోవడం తమ జట్టుకు చాలా కష్టంగా ఉన్నదన్నాడు. తమ కుర్రాళ్లు వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రతిభ కనబరిచారని జంబ్రొట్టా ప్రశంసించాడు. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో తమ జట్టు చాలా మెరుగుపడిందన్నాడు.
డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ పై రెండు గోల్స్ చేయడం చాలాచాలా హ్యాపీగా ఉన్నదని ఢిల్లీ సారధి ఫ్లోరెంట్ మాలౌదా వ్యాఖ్యానించాడు. తాను ఐఎస్ఎల్ టోర్నీలో గోల్ చేయడం ఇదే మొదటిసారన్నాడు. తాము అంకిత భావంతో ఆడుతున్నందువల్లే తదుపరి దశకు దూసుకెళ్లగలుగుతున్నామన్నాడు. సెమీస్ నుంచి ఫైనల్స్ వరకూ దూసుకెళ్లడమే తమ లక్ష్యమన్నాడు. తమ ప్లేయర్ రిచర్డ్ గాడ్జె గాయపడటం బాధాకరమని వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, ప్రతిసారి మెరుగైన ఆటతీరు ప్రదర్శించడమే తమ పని అన్నాడు.
వరుసగా రెండోసారి జట్టు ఓటమి పట్ల చెన్నైయిన్ అసిస్టెంట్ కోచ్ సాబిర్ పాషా తీవ్ర అసంత్రుప్తికి గురయ్యాడు. ఫస్టాఫ్‌లో జట్టు ప్లేయర్లు అనుసరించిన వ్యూహమే కొంపముంచిందన్నాడు. మ్యాచ్ ప్రారంభంలోనే తొలి గోల్ చేసే అవకాశాన్ని కోల్పోయామన్నాడు. ఇక సెకండాఫ్‌లో ఆ అవకాశమే లేదన్నాడు. వ్యక్తిగత పొరపాట్ల కారణంగా కొన్నిసార్లు జట్టు మేనేజ్మెంట్ రూపొందించే వ్యూహాలు పనిచేయవన్నాడు. ఢిల్లీ సొంతగడ్డపై తాము ఓటమి పాలవ్వడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని, ప్లేయర్లు సరైన ప్రతిభ ప్రదర్శించలేకపోయారన్నాడు.