ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో లివర్‌పూల్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్ 4-1 తేడాతో లూటన్ టౌన్ టీమ్‌ను చిత్తు చేసింది.
వర్జిల్ వాన్ డిజ్క్(56వ నిమిషం),కోడి గాక్పో(58వ నిమిషం), లూయిస్ డియాజ్(71వ నిమిషం), హార్వే ఇలియట్(90వ నిమిషం)లో చెరో గోల్ నమోదు చేసి లివర్‌పూల్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

లూటన్ టౌన్ తరఫున చిడోజీ ఓగ్బెన్(12వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. ఈ విజయంతో లివర్‌పూల్ పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
లివర్‌పూల్ దూకుడు..
ఆట ఆరంభం నుంచే లివర్‌పూల్ దూకుడు కనబర్చింది. బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆ జట్టు.. గోల్స్ మాత్రం చేయలేకపోయింది. 4వ నిమిషంలోనే లివర్‌పూల్‌కు గోల్ చేసే అవకాశం దక్కినా.. వృథా చేసుకుంది. బంతిని గోల్ పోస్ట్‌కూ దూరంగా కొట్టింది. ఆ కొద్ది సేపటికే లూటన్ టౌన్ ఖాతా తెరిచింది.
గోల్ పోస్ట్ ముందు సహచర ఆటగాడు అందించిన పాస్‌ను చిడోజి ఓగ్బెన్ తన తలతో అద్భుతంగా గోల్‌గా మలిచాడు. అనంతరం లివర్‌పూల్ 31వ నిమిషం, 34వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ప్రత్యర్థి గోల్ కీపర్ ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాడు. దాంతో ఫస్టాఫ్‌ను లూటన్ టౌన్ 1-0 ఆధిక్యంతో ముగించింది.
హెడ్ కిక్స్‌తో..
గోల్స్ చేయలేదనే ఒత్తిడి ఉన్నా సెకండాఫ్‌లోనూ లివర్‌పూల్ చెలరేగింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని చేధిస్తూ పదే పదే లూటన్ టౌన్ గోల్ పోస్ట్‌పై దాడి చేసింది. ఈ క్రమంలో రెండు నిమిషాల వ్యవధిలోనే రెండో గోల్స్‌ను నమోదు చేసి 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ రెండో గోల్స్‌ను కూడా లివర్‌పూల్ ఆటగాళ్లు హెడ్ కిక్‌తో సాధించడం విశేషం.
56వ నిమిషంలో సహచర ప్లేయర్ అందించిన పాస్‌ను వర్జిల్ వాన్ డిజ్క్ హెడ్ కిక్‌తో గోల్‌గా మలిచాడు. ఆ వెంటనే కోడి గాక్సో సైతం అదే తరహాలో హెడ్ కిక్‌తో గోల్ కొట్టి లివర్ పూల్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. అనంతరం మరింత జోరు కనబర్చిన లివర్‌పూల్ ఆటగాళ్లు బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్నారు.
తేలిపోయిన లూటన్..
71వ నిమిషంలో లూయిస్ డియాజ్ సూపర్ కిక్‌తో గోల్ కొట్టి లివర్‌పూల్ ఆనంధాన్ని మూడింతలు చేశాడు. లివర్‌పూల్ ఆటగాళ్ల జోరు ముందు తేలిపోయిన లూటన్ టౌన్ ప్లేయర్లు.. గోల్స్ దేవుడెరుగు.. కనీసం బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు.
90వ నిమిషంలో హార్వే ఇలియట్ ప్రత్యర్థి డిఫెన్స్‌ను చేధిస్తూ సూపర్ కిక్‌తో నాలుగో గోల్ నమోదు చేసి లివర్‌పూల్ విజయాన్ని ఖాయం చేశాడు. ఆటను 8 నిమిషాలు పొడిగించినా.. లూటన్ టౌన్ గోల్స్ నమోదు చేయలేకపోయింది.