పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్, లివర్‌పూర్ ప్లేయర్ డియోగో జోటా(28) మృతి చెందాడు. బుధవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో డియోగో జోటాతో పాటు అతని సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా మరణించాడు. స్థానికి మీడియా వివరాల ప్రకారం స్పెయిన్‌లోని జమెరా నగరంలో అర్థరాత్రి 12.40 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కారు అదుపు తప్పడంతో మంటలు చెలరేగాయని, ప్రమాద ధాటికి అందులో ఉన్న డియోగోతో పాటు అతని సోదరుడు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. కారు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
డియోగో జోటా 10 రోజుల క్రితమే తన చిన్ననాటి స్నేహితురాలు రూట్ కార్డోసోను పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే అతను ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. పెళ్లికి ముందే తన ప్రేయసితో సహజీవనం చేసిన జోటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

డియోగో మరణాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ధృవీకరించింది. కారు ప్రమాదంతో డియోగో జోటాతో పాటు అతని సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా మరణించారని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పెడ్రో ప్రోయెంకా తెలిపారు. డియోగో సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా ప్రొఫెషనల్ ఆటగాడే కావడం గమనార్హం. అతను పోర్చుగీస్ 2వ లీగ్‌లో పెనాపీల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
పోర్డోలో జన్మించిన డియోగో జోటా.. 2016లో అట్లెటిక్ మాడ్రిక్ క్లబ్‌తో తన ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాడు. ప్రీమియర్ లీగ్‌లో వోల్వర్‌హాంప్టన్ వాండరర్స్ తరఫున ఆడిన జోటా.. ఆ తర్వాత లివర్‌పూల్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఎఫ్‌ఏ కప్, లీగ్ కప్ టైటిల్స్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. పోర్చుగల్ జట్టు తరఫున కూడా జోటా రాణించాడు.