భారత పుట్ బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ త్వరలోనే భారత్ కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. వాస్తవానికి గతంలోనే ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా మరోసారి ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చింది. అక్టోబర్ - నవంబర్ మధ్య కేరళలో ఒక వారం పాటు లియోనెల్ మెస్సీ ఉండనున్నట్లు మరోసారి కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని క్రీడా మంత్రి వి అబ్దురహిమాన్ తాజాగా ప్రకటించారు. దీంతో కేరళ ఫుట్ బాల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేరళలో కనీసం రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ తో తమ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి చెప్పారు. మెస్సీ కెప్టెన్సీలోని పురుషుల జాతీయ జట్టు ఈ స్నేహపూర్వక మ్యాచులు ఆడనుంది. "అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు మెస్సీ కేరళలో ఉంటాడు. కేవలం స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడటమే కాకుండా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ కూడా అవుతాడు. మీ అందరినీ కలిసేందుకు స్జేజ్ పై 20 నిమిషాలు కేటాయిస్తాడు." అని క్రీడా మంత్రి వెల్లడించారు.

పోటీ ఎవరితోనంటే?
కేరళలో జరిగే ఈ అంతర్యాతీయ మ్యాచులతో అర్జెంటీనా జట్టు ఎవరితో తలపడనుందో ప్రస్తుతానికి తెలీదు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే. ఫిఫా టాప్ 50లో ఉన్న జట్టుతో అర్జెంటీనా తలపడనుందని తెలుస్తోంది. జపాన్ (15), ఇరాన్ (19), సౌత్ కొరియా (22), ఆస్ట్రేలియా (24), ఖతార్ (46) ర్యాంకింగ్స్ లో ముందున్నాయి.

ఖర్చు మొత్తం వాళ్లదే!
ఈ అంతర్జాతీయ మ్యాచులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఫుట్ బాల్ ఈవెంట్ ను సమర్థవంతంగా నిర్వహిస్తామని క్రీడా మంత్రి ధీమా వ్యక్తం చేశారు. "ఈ హై ప్రొఫైల్ పుట్ బాల్ ఈవెంట్ నిర్వహించేందుకు ఖర్చయ్యే మొత్తాన్ని రాష్ట్రానికి సంబంధించిన మెర్చంట్స్ ద్వారా అందుతుంది." అని క్రీడా శాఖ మంత్రి అన్నారు.