మెస్సీ కన్నీళ్లకు కారణం ఇదే..!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలో కన్నీళ్లు పెట్టుకోవడం వెనుక అసలు కారణం బయటపడింది. ఆయన తండ్రి జార్జ్ మెస్సీ ప్రస్తుతం తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని మెస్సీ కుటుంబ సభ్యులు ఓ అధికారిక ప్రకటన ద్వారా ధ్రువీకరించారు. తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న మెస్సీ.. ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా భావోద్వేగానికి గురైనట్లు స్పష్టమైంది.
ఇటీవల అల్జీరియాతో జరిగిన ప్రపంచకప్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొట్టిన వెంటనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలో ఆయన కళ్ల నుంచి నీళ్లు రావడం చూసి ఫుట్‌బాల్ ప్రపంచం ఆందోళనకు గురైంది. దీనిపై స్వయంగా స్పందించిన మెస్సీ.. ఆ కన్నీళ్లకు ఫుట్‌బాల్‌కు ఎలాంటి సంబంధం లేదని, గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంలో అత్యంత కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కథనాలపై మండిపడ్డ మెస్సీ కుటుంబం
జార్జ్ మెస్సీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో, మీడియాలోని కొన్ని విభాగాలలో వస్తున్న రకరకాల ఊహాగానాలు, తప్పుడు ప్రచారాలపై మెస్సీ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని, ఇలాంటి సున్నితమైన అంశంపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం సరికాదని మండిపడ్డారు. కేవలం అత్యంత సన్నిహితుల వద్ద మాత్రమే జార్జ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఉందని స్పష్టం చేస్తూ, అనవసర పుకార్లను నమ్మవద్దని అభిమానులను కోరారు.
ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమ కుటుంబ ప్రైవసీని గౌరవించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఓ వ్యక్తి ఆరోగ్యం, కుటుంబ మానసిక ప్రశాంతత మీడియాకు కేవలం రేటింగ్‌ల కోసమో, వినోదం కోసమో కాదని హితవు పలికారు. ప్రస్తుతం జార్జ్ మెస్సీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలియజేశారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
మైదానంలో సరికొత్త చరిత్ర సృష్టించిన మెస్సీ
వ్యక్తిగత జీవితంలో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నప్పటికీ.. లియోనెల్ మెస్సీ మైదానంలో అద్భుత ప్రదర్శనతో సరికొత్త రికార్డులు సృష్టించారు. అల్జీరియాపై అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన గోల్స్ చేయడం ద్వారా, పురుషుల ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జర్మనీ లెజెండ్ మిరోస్లావ్ క్లోస్ ఆల్-టైమ్ రికార్డును మెస్సీ సమం చేయడం గమనార్హం.
అంతేకాకుండా, ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ భాగస్వామ్యం నమోదు చేసిన ఆటగాడిగా బ్రెజిల్ దిగ్గజం పీలే రికార్డును మెస్సీ అధిగమించారు. మెస్సీ పేరిట ఇప్పుడు వరల్డ్ కప్స్ లో మొత్తం 24 గోల్ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. కష్టకాలంలోనూ జట్టును ముందుండి నడిపిస్తూ, దేశానికి విజయాన్ని అందించిన మెస్సీ మానసిక దృఢత్వానికి ఈ మ్యాచ్ నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications