
ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో అర్జెంటీనా సత్తా చాటుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో స్కోరు బోర్డును అర్జెంటీనా త్వరగా తెరిచింది. లుసైల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి హాఫ్ ముగిసే సరికి అర్జెంటీనా పైచేయి సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన 23వ నిమిషంలోనే అర్జెంటీనాకు ఇక పెనాల్టీ కిక్ దక్కింది. ఫ్రాన్స్ ఆటగాళ్లు ఫౌట్ చేసినట్లు నిర్ణయించిన రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని గోల్ చేసే బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్న అర్జెంటీనా సారధి లియోనెల్ మెస్సీ.. మరోసారి తనను అందరూ ఫుట్‌బాల్ జీనియస్ అని ఎందుకు పిలుస్తారో నిరూపించాడు.
పెనాల్టీ స్పాట్ నుంచి చూడచక్కని షాట్‌తో గోల్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఏంజెల్ డి మరియా తనకు దక్కిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 36వ నిమిషంలో అద్భుతమైన గోల్‌తో తమ జట్టు ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. మెస్సీ, డి మరియా ఇద్దరూ కూడా అర్జెంటీనా విజయాల్లో కొంత కాలంగా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్ జట్టు ఏదో నెర్వస్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ కీలక ఆటగాడు ఆలివియర్ గిరోడ్, ఒస్మానే డింబెలేను ఆ జట్టు కోచ్ వెనక్కు పిలిచాడు.
వాళ్ల స్థానంలో మార్కస్ థురమ్, రాండాల్ కోలోను మైదానంలో దించాడు. ఈ జట్టులో ఐదుగురు సభ్యులు ఫ్లూ వంటి లక్షణాలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని సాధ్యమైనంత ప్రశాంతంగా ఫేస్ చేస్తున్నట్లు ఆ జట్టు కోచ్ డిడియర్ డెస్‌చాంప్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మెస్సీ కనుక ఈ వరల్డ్ కప్ గెలిస్తే అతన్ని ఇక రొనాల్డోతో పోల్చకూడదని, మెస్సీనే అసలు సిసలు గ్రేట్ ప్లేయర్ అవుతాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.